పంచాయతీ ఎన్నికలు: రాజుకుంటున్న వేడి!

27 Jan, 2021 08:18 IST|Sakshi

ఎన్నికలకు పల్లెలు సన్నద్ధం

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం 

సాక్షి, అమరావతి బ్యూరో: పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటనతో గ్రామాల్లో సందడి నెలకొంటోంది. బరిలో నిలిచే అభ్యర్థులు, నిలిపే నాయకులు, ఆశావహులతో పల్లెలన్నీ హడా విడిగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగనున్నాయి. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పారీ్టలు స్థానికంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందువల్ల గ్రామాల్లో ఆయా పార్టీల నాయకుల సమీకరణలు, సమావేశాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులను ఆశిస్తున్న వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.

ఇంకా ఖరారు కాని చోట్ల ఆశావహులు తమ పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఈనెల 29 నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. దీంతో నేడు, రేపట్లో తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పెండింగులో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల పేర్ల జాబితా కొలిక్కి వస్తుంది. మరోవైపు ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని రప్పించే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి రెండున్నరేళ్లవుతోంది. అప్పట్నుంచి పంచాయతీలకు పాలక వర్గాల్లేకుండా ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీలకు ఎన్నికల జరగనుండడంతో ప్రధాన పార్టీల మద్దతుదార్లు, కార్యకర్తలు అందుకవసరమైన సన్నద్ధతలో ఉన్నారు.(చదవండి: ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ )

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం! 
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వంకంటే ఈ ప్రభుత్వం సత్వరమే సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటోంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పథకాల ఫలాలు అందడంతో ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తి తమ పార్టీ మద్దతుదార్లు సునాయా సంగా గెలుస్తారన్న ధీమా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గెలుపు బాట వేస్తాయన్న విశ్వాసం ఆ క్యాడరులో వ్యక్తమవుతోంది. (చదవండి: ఏకగ్రీవంతో పల్లెలు ప్రశాంతం

ఎన్నికల ఏర్పాట్లతో యంత్రాంగం.. 
మరోవైపు తొలివిడత పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండ్రోజుల సమయమే ఉండడంతో సంబంధిత అధికారులు తొలివిడత ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ జిల్లా కలెక్టరు, జాయింట్‌ కలెక్టర్, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె. మాధవీలత ‘సాక్షి’కి చెప్పారు. కాగా మంగళవారం గణతంత్ర దినోత్సవం సెలవు కావడంతో బుధవారం నుంచి పూర్తి స్థాయి ఎన్నికల పక్రియ మొదలుకానుంది.  

మరిన్ని వార్తలు