AIADMK: ‘ఓపీఎస్‌.. ఒకే నాయకత్వం’

10 Jul, 2021 06:52 IST|Sakshi

పన్నీర్‌సెల్వం వర్గం నినాదాలు

గరంగరంగా అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశం 

ఆరు తీర్మానాలతో ముగింపు 

అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన  నాటి నుంచి తరచూ వార్తల్లోకి  ఎక్కుతోంది. జంట నాయకత్వం వద్దు,  ఒకే నాయకత్వం కావాలి అంటూ  మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం వర్గం మరోసారి నిరసన గళం విప్పి వివాదానికి తెరదీసింది. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అన్నాడీఎంకే పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. జయలలిత మరణం తరువాత పార్టీ ఇద్దరి (ఓపీఎస్, ఈపీఎస్‌) సారధ్యంలోకి వెళ్లింది. మూడోసారి గెలవడం ద్వారా హాట్రిక్‌ కొట్టగలమని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగినా అధికారం డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఆనాటి నుంచి ఓటమితో కుంగిపోయిన పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్నికల అనంతరం జరిగిన తొలి సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ప్రధాన ప్రతిపక్షనేతగా ఎడపాడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉప నేతగా పన్నీర్‌సెల్వం పేరును ఎడపాడి ప్రతిపాదించారు. అధికారంలో ఉన్నా లేకున్నా నెంబర్‌ టూగా ఉండాలా అంటూ నిరాకరించిన పన్నీర్‌సెల్వం సీనియర్‌ నేతల బుజ్జగింపుల తరువాత ఒప్పుకున్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పన్నీర్, ఎడపాడి సమక్షంలో అంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఓపీఎస్‌ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ‘పార్టీకి ఏక నాయకత్వం ఉండాలి’ అంటూ ఆయన వర్గం నేతలు నినాదాలు చేయడం కలకలం రేపింది. ఈ నినాదాలు చేసిన తన వర్గం నేతలను పన్నీర్‌సెల్వం వారించనూ లేదు, ప్రోత్సహించనూ లేదు. అందరికీ నమస్కరిస్తూ లోనికి వెళ్లిపోయారు. 

ఆరు తీర్మానాలు 
కాగా సంస్థాగత ఎన్నికలు, పార్టీ పరంగా భవిష్యత్‌ కార్యాచరణపై కొద్దిసేపు చర్చించిన పార్టీ అధినేతలు ఈ సందర్భంగా ఆరు తీర్మానాలు చేశారు. కావేరి నదీజలాల వాటా విషయంలో తమిళనాడు హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మేఘధాతు ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవాలి, వరి ధాన్యాల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి ఖండన, కుటుంబ పెద్దకు రూ.1000ల హామీని నెరవేర్చకుంటే పోరాటం తదితర తీర్మానాల ఆమోదంతో సమావేశం ముగిసింది.

మరిన్ని వార్తలు