100 కోట్ల ఆరోపణలపై దద్దరిల్లిన లోక్‌సభ

23 Mar, 2021 04:32 IST|Sakshi

ఠాక్రే ప్రభుత్వం గద్దె దిగాలన్న బీజేపీ

బీజేపీ కుట్రగా అభివర్ణించిన శివసేన

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. హోంమంత్రిపై ముంబై పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన వ్యక్తి  అవినీతి ఆరోపణలు చేయడం చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు తదితరాల నుంచి ప్రతీ నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని ముంబై పోలీసు అధికారులకు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్వయంగా ఆదేశాలిచ్చారని ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను జీరో అవర్‌లో, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల మధ్య బీజేపీ సభ్యుడు మనోజ్‌ కోటక్‌ లేవనెత్తారు.

ఈ విషయంలో ఇంతవరకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తక్షణమే ఆయన ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ‘ఇది చాలా సీరియస్‌ అంశం. హోం మంత్రే కాదు. మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి.  సీబీఐతో సమగ్రంగా విచారణ జరపాలి’ అన్నారు. దీన్ని రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంగా చూడకూడదని బీజేపీ సభ్యుడు రాకేశ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ముంబై నుంచే రూ. 100 కోట్లు అయితే, మొత్తం రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతిపై ఆరోపణలు రావడం ఇదే ప్రథమం కాదని, గతంలో డీజీపీ స్థాయి అధికారి  ఆయనపై  ఆరోపణలు చేశారని బీజేపీ సభ్యుడు కపిల్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

శరద్‌ పవార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్న మహారాష్ట్ర  సీనియర్‌ నేత.. ఆ వెంటనే మాట మార్చారన్నారు. ‘వాస్తవాలు బయటపడ్తాయని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. శివసేన ఎంపీ వినాయక రౌత్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.  విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిర పర్చేందుకు కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు ఆరోపించారు. సచిన్‌ వాజే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం ఫడ్నవీస్‌ను ఉద్ధవ్‌ ఠాక్రే కోరారని స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా తెలిపారు. అయితే, సీఎం ఆ అభ్యర్థనను  తోసిపుచ్చారన్నారు. జీరో అవర్‌ను అధికార పక్షం రిగ్గింగ్‌ చేస్తోందని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియ సూలే విమర్శించారు.

సీబీఐతో దర్యాప్తు చేయించాలి
సుప్రీంలో పరమ్‌వీర్‌ పిటిషన్‌
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనను ముంబై పోలీస్‌ కమిషనర్‌ పోస్ట్‌ నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని  కోరారు.  ‘అనిల్‌ దేశ్‌ముఖ్‌ 2021 ఫిబ్రవరి లో సచిన్‌ వాజే(ముంబై క్రైమ్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌), సంజయ్‌ పాటిల్‌(ఏసీపీ, ముంబై సోషల్‌ సర్వీస్‌ బ్రాంచ్‌)లను పిలిపించుకుని ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు, ఇతర మార్గాల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారు’ అని పిటిషన్‌లో పరమ్‌వీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు