TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!

14 Dec, 2022 17:43 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే జరగాల్సి ఉంది. కాని ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అదే విధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నాయకులంతా తల కిందుల తపస్సులు చేస్తున్నారు.

సాంతం.. సర్వేల మయం
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు... కొత్తగా అసెంబ్లీలో ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేనండి... సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్‌గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతల గురించి.. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నదాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

గ్రాఫ్‌ బాగుంటూనే టికెట్‌
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నట్లు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు... టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తున్నవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేయించుకుంటున్నారు. కొందరిని నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే... గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికే అని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం సిట్టింగులందరికీ అని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలకు అర్థాలు వేరులే అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికే అందరి జాతకాలు ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజల్లో గ్రాఫ్ సరిగా లేకపోతే టిక్కెట్‌ రాదని భయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

పల్లె పల్లెకు ప్రశ్నల రాయుళ్లు
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్‌మెంట్‌ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని అక్కడ ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా పరిశీలించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు.

టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌గా నియమించింది. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యూత్, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రజల్లో తమకున్న గ్రాఫ్‌ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ప్రతి పార్టీ ఆపరేషన్ ఆకర్ష గ్రామ స్థాయి నుంచి అమలు చేస్తోంది. ముందుస్తు ఊహాగానాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా రాజకీయ జాతర మొదలైంది.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు