ఎల్జేపీలో తిరుగుబాటు: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!

18 Jun, 2021 20:31 IST|Sakshi

పట్నా/న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తి ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన ఎంపీ పశుపతి కుమార్‌ పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కనుందా... జేడీయూను ఎదిరించిన అన్న కొడుకు చిరాగ్‌ పాశ్వాన్‌ను నైతికంగా దెబ్బకొట్టినందుకు ఆయనకు అగ్రతాంబూలం దక్కనుందా.. అన్న ఊహాగానాలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశుపతి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న అంశంపై బాబాయ్‌- అబ్బాయ్‌ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే.. పార్లమెంటరీ పార్టీ నేతగా రాజీనామా చేస్తాను’’ అని పశుపతి పేర్కొన్నారు. 

కాగా ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గత గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీలో తిరుగుబాటు అనంతరం తాము ఇదే కూటమిలో కొనసాగుతామని పశుపతి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పశుపతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్‌ కుమార్‌తో కలిసి ఆయన పావులు కదిపుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

మరోవైపు.. చిరాగ్‌ పాశ్వాన్‌ సైతం బీజేపీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ప్రధాని మోదీ రాముడు అయితే, తాను హనుమంతుడినంటూ గతంలో అభిమానం చాటుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే పశుపతికి పదవి ఇస్తే బాగానే ఉంటుందని కొంతమంది స్థానిక(బిహార్‌) బీజేపీ నేతలు అభిప్రాయపడుతుండగా, మరో వర్గం మాత్రం చిరాగ్‌ పాశ్వాన్‌కే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. 

ఇక బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(2020) చిరాగ్‌ పాశ్వాన్‌ జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 35 స్థానాల్లో జేడీయూ సీట్లకు గండికొట్టగా.. ఆయా చోట్ల బీజేపీకి అనుకూల పవనాలు వీయడం గమనార్హం. ఇక తాజా పరిణామాలు, ప్రకటనలతో బిహార్‌ రాజకీయాలు ఒక్కసారిగా దేశమంతా చర్చనీయాంశమయ్యాయి.  

చదవండి: LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు
‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్‌ చచ్చిపోయాడు’

మరిన్ని వార్తలు