బీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు

12 Dec, 2022 16:00 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్‌ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు.  పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు.

తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్‌ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రించేందుకు ఔటర్‌ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు.

ప్రస్తుతం ఔటర్‌ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్‌సన్‌పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.  ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు.

మరిన్ని వార్తలు