మా పార్టీ పరిధిలోనిది కాదు

19 Nov, 2020 04:35 IST|Sakshi

రాజధాని విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై పవన్‌ వ్యాఖ్య

అమరావతి జేఏసీ నేతలతో భేటీ 

సాక్షి, అమరావతి: అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం తమకు చెప్పిందని, అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఎంత వరకు ప్రజల్లోకి తీసుకువెళ్తోందనే విషయం తమ పార్టీ పరిధిలోనిది కాదని వ్యాఖ్యానించారు.

అమరావతి జేఏసీ నేతలకు ప్రధాని మోదీతో అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రభుత్వం మారింది కాబట్టి రాజధాని మారుస్తానంటే కుదరదని, అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌ చెప్పారు. సమస్య పరిష్కారానికి డెడ్‌ లైన్‌ విధించుకోవద్దని జేఏసీ నేతలకు సూచించారు. ప్రభుత్వం అమరావతి రాజధాని కాదు అన్న విషయం ఎక్కడా రికార్డు పరంగా చెప్పలేదని, ఆ పార్టీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటున్నారని చెప్పారు.  కాగా, 2024 కంటే ముందే ఎన్నికలు రావచ్చని, ఆ దిశగా జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పవన్‌ పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు