Pawan Kalyan: వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం

15 Mar, 2022 03:30 IST|Sakshi
గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌

ఆ పార్టీని గద్దె దింపడానికి అందర్నీ కలుపుకొనిపోతాం 

బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నా 

రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటాం 

రెండు చోట్ల ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు 

2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 

అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం 

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు 

అమరావతే ఏకైక రాజధాని 

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ 

సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని, ఆ పార్టీని గద్దె దింపడానికి అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. పార్టీలు, వ్యక్తగత ప్రయోజనాలు వదిలి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పోరాడటానికి రోడ్‌ మ్యాప్‌ని అందజేస్తామని బీజేపీ చెప్పినా, ఇంతవరకు ఇవ్వలేదన్నారు.

2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, అధికార పార్టీ నాయకులు తనను ఎన్నో సార్లు మానసిక అత్యాచారం చేశారని చెప్పారు. 2019లో ఒక్క సీటే గెలిచినా, స్థానిక సంస్థల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. 150 మంది సభ్యులతో మొదలైన పార్టీ నేడు 5 లక్షల మంది సభ్యత్వం తీసుకొనే దిశగా సాగుతోందని చెప్పారు. 2024లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతతో పాలన మొదలుపెట్టిందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రోడ్లు వేయకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు.

అమరావతే ఏకైక రాజధాని
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే వాటిని సవరించి, కొనసాగించాలన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పీఆర్‌సీ సవరణ చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం తెస్తామన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతానన్నారు. రేషన్‌ కార్డు ఉన్న అందరికి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఐదేళ్లలో ఐదు లక్షల మంది యువతకు సంవత్సరానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 

మంత్రులపై విమర్శలు
తాను వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకమని ఒకవైపు చెబుతూనే మరోవైపు మంత్రులను దూషించారు. మంత్రులు  వెలంపల్లి, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పేర్లను వెటకారంగా పలికారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి భీమ్లానాయక్‌ ట్రీట్‌మెంట్‌ రుచి చూపిస్తానన్నారు. 

పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారు : నాదెండ్ల
జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌లను ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందని పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు తెలియడానికి అస్త్ర యాప్‌ను సిద్ధం చేశామన్నారు. 

రాష్ట్రం అప్పుల పాలవుతోంది : నాగబాబు
అధికారపార్టీ చర్యలతో రాష్ట్రం అప్పులపాలవుతోందని నాగబాబు విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు.    

మరిన్ని వార్తలు