రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

5 Dec, 2020 05:19 IST|Sakshi

నెల్లూరు, చిత్తూరు జిల్లాల పర్యటనలో పవన్‌ డిమాండ్

తొట్టంబేడు (చిత్తూరు జిల్లా)/నాయుడుపేట టౌన్‌/చిల్లకూరు: నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చొప్పున వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్యలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా గ్రామస్తులెవరూ హాజరు కాలేదు.

పంట నష్టం పరిహారాన్ని సీఎం తమకు ఖాతాల్లోనే వేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ముఖాముఖికి హాజరు కాబోమని జనసేన నేతలకు గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో జనసేన నేతలు ముచ్చివోలు నుంచి కొంతమందిని పొయ్యకు తీసుకొచ్చి గ్రామస్తులను తిట్టించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముఖాముఖికి ఎవరూ రాకపోవడంతో పవన్‌ రోడ్‌ షో మాత్రమే చేశారు. అధికార పార్టీ నేతలు.. జనసేన కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనని హెచ్చరిస్తూ రెండే నిమిషాల్లో ప్రసంగం ముగించి తర్వాత నాయుడుపేటలో పర్యటించారు. కాగా, తిరుపతి నుంచి గూడూరు బయలుదేరిన పవన్‌.. చిల్లకూరు మండల బూదనం టోల్‌ప్లాజా వద్ద రోడ్‌షో నిర్వహించగా వెలవెల పోయింది. 

మరిన్ని వార్తలు