జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: జనసేన

17 Nov, 2020 17:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నగర పరిధిలోని పార్టీ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు చర్చించుకున్న తర్వాత పోటీ విషయమై తమ వద్ద ప్రస్తావన తెచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేరిట మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు. 

జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది’’ అని పేర్కొంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక భారీ విజయంతో జోరు మీదున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైన వేళ, ఆ పార్టీతో చేతులు కలిపిన జనసేన ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఏపీలో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నేడు నగారా మోగిన విషయం తెలిసిందే.  డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మంగళవారం వెల్లడించారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.(చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల)

  • నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20
  • నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21
  • నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22
మరిన్ని వార్తలు