దత్తపుత్రుడా? పొత్తు మిత్రుడా?.. తెర వెనక ఏం జరిగింది?

9 Mar, 2023 19:39 IST|Sakshi

బీజేపీతో జనసేన బంధానికి నూకలు చెల్లాయా? ఇప్పటికే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి హ్యాండివ్వబోతున్నారా? గతంలో మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీతో అనైతిక పొత్తుకు సిద్ధమవుతున్నారా? టీడీపీకి సహకరించాలంటూ జనసేన శ్రేణులకు పవన్‌ ఆదేశాలిచ్చారా? 

బీజేపీతో పొత్తులో కొనసాగుతూనే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. మిత్ర పక్షాన్ని కాదని.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అంతర్గతంగా సహకరించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవిధంగా అయితే తెలుగుదేశం పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారో... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆవిధంగానే వ్యవహరించడానికి సమాయత్తమవుతున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

చాలాకాలంగా బీజేపీని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌ని కలిస్తే.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లి కలిసారు. అప్పట్లోనే ఇద్దరి మధ్య పొత్తులపై చర్చలు జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు.. ఖండించలేదు. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేయడం లేదు.

మళ్లీ అశ్వథ్థామ సూత్రమేనా?
జనసేన తమతోనే ఉందని బిజెపి నాయకులు మాత్రం చెప్పుకుంటున్నారే గాని.. జనసేన నాయకులు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా తాము బిజెపికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించడంలేదు. కనీసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు కనిపించలేదు. బీజేపీ నేతలు నిర్వహిస్తున్న ప్రచారంలో కూడా జనసేన నేతలు కలిసి రావడం లేదు.

ఉత్తరాంధ్రలో గాని రాయలసీమలో గాని బీజేపీ నేతలు ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అధికార వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని చెబుతున్నారే తప్ప బిజెపికి ఓటు వేయండి అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్‌ అంతా గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పవన్‌ కల్యాణ్‌ టీడీపీకే సహకరిస్తున్నట్లు అర్థమవుతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. 
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

మరిన్ని వార్తలు