అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వీడిన సీనియర్‌ నేత

10 Mar, 2021 18:55 IST|Sakshi
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత పీసీ చాకో(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నేత పీసీ చాకో

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత పీసీ చాకో బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చాకో కేరళ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని, పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని విమర్శించారు. దీని గురించి తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా మౌనం వహించిందని అన్నారు. వర్గ విభేదాలతో విసిగిపోయి పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు మాజీ మంత్రి ప్రకటించారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

కేరళ కాంగ్రెస్లో ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నేత ఎవరూ మనుగడ సాగించలేరని చాకో దుయ్యబట్టారు. ‘‘నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను.. రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపాను.. గత కొద్దికాలంగా ఈ నిర్ణయంపై నేను పలువురితో చర్చించాను.. అనేక రకాలుగా ఆలోచించాను. నేను కేరళ నుంచి వచ్చాను.. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు.. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఏ)గా విడిపోయింది. ఇది కేరళ కాంగ్రెస్ యూనిట్‌గా పనిచేస్తున్న రెండు పార్టీల సమన్వయ కమిటీ’ అంటూ చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఓ వర్గానికి మాజీ సీఎం ఊమెన్ చాందీ నాయకత్వం వహిస్తుంటే.. మరో వర్గానికి రాష్ట్ర పీసీపీ చీఫ్ రమేశ్ చెన్నితాల నాయకత్వం వహిస్తున్నారు.. చాలా ఏళ్లుగా ఈ రెండు వర్గాలు యాక్టివ్‌గా ఉన్నాయి’ అంటూ చాకో మండిపడ్డారు. ‘కేరళ కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నాయకులు గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశంపై హైకమాండ్‌ ముందు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది’ అని తెలిపారు చాకో.

పీసీ చాకో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎంపీగా కీలక బాధ్యతలు చేపట్టారు. కేరళ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా చాకో ఆరోపణలు గుప్పించారు. పోటీచేసే అభ్యర్థుల జాబితా గురించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్‌వాదిగా చెబుతున్నాను. కేరళలో పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.. మీరు కాంగ్రెస్‌లో ఏదో ఓ వర్గానికి చెందినవారైతే మాత్రమే మీకు మనుగడ ఉంటుంది... కాంగ్రెస్ నాయకత్వం అంత చురుకుగా లేదు’ అని ఆరోపించారు.

చదవండి:
అశ్లీలం.. గందరగోళం..

ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ!

>
మరిన్ని వార్తలు