ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం

27 Jan, 2021 04:22 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ

ప్రోత్సాహకాలు భారీగా పెంపు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయనివ్వం.. అన్నీ సరిదిద్దుతాం

గ్రామాల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర: మంత్రి బొత్స  

సాక్షి, అమరావతి: గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఏకగీవ్ర పంచాయతీలకు 2001 నుంచి ఇస్తున్న ప్రోత్సాహకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భారీగా పెంచిందని తెలిపారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం జీవో 34 జారీ చేసిందన్నారు.  ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఉపాధి హామీ, ఇతర పథకాల ద్వారా 90 శాతం అధికంగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 

ఏకగ్రీవాలను అడ్డుకునేలా నిమ్మగడ్డ వ్యాఖ్యలు 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విచక్షణతో కాకుండా కుట్రపూరితంగా ఓ పార్టీకి తొత్తులా పనిచేస్తున్నట్లుగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విచక్షణాధికారాలు విచక్షణతో వినియోగించడానికిగానీ అధికారులను భయాందోళనలకు గురిచేయడానికి కాదన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులపై నిమ్మగడ్డ తీసుకున్న చర్యలను ఆయన విచక్షణకే విడిచిపెడుతున్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత ప్రభుత్వం అన్నీ సరిదిద్దుతుందని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలను పరిశీలించేందుకు ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని ఎన్నికల కమిషనర్‌ పేర్కొనటంపై మండిపడ్డారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచుతూ గత ఏడాది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని నిమ్మగడ్డ అప్పుడు ప్రశంసించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకగ్రీవాలను అడ్డుకునేలా ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఏకగ్రీవాలను అడ్డుకుంటామనేలా నిమ్మగడ్డ మాట్లాడటంపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఉద్దేశం, భాష అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయనకు మనసులో మరేదైనా ఉద్దేశం ఉంటే చెప్పాలి గానీ ఏకగ్రీవ ఎన్నికలను అడ్డుకుంటామనేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు 2001 నుంచి అమలులో ఉన్న విధానమేనని తెలుసుకోవాలన్నారు. 

గ్రామాల సమగ్రాభివృద్ధి కోసమే: బొత్స
గ్రామాల్లో కుల, వర్గ చిచ్చు రగల్చడం ద్వారా అశాంతి సృష్టించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుందనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రజలంతా ఒకే మాట, ఒకే బాటగా ఉంటే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు.  

మరిన్ని వార్తలు