ప్రజల్ని కాల్చిచంపిన వారిని మర్చిపోయారా?

19 Apr, 2022 03:18 IST|Sakshi

విద్యుత్‌ సంస్థలను అప్పులపాల్జేసింది చంద్రబాబే 

మే 1 నుంచి సాధారణ స్థితికి విద్యుత్‌ సరఫరా 

ఇంధనశాఖ సమీక్షలో విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై మాట్లాడుతున్న వారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేసిన రైతులపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను మరిచిపోయారా.. అని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్‌ పాలనలో అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలపై  దృష్టిసారించి సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరాపై ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్, ఏపీఎస్‌ఈసీఎంల అధికారులతో సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్‌ల నుంచి త్వరలో మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆరువేల మెగావాట్ల హైడల్‌ (పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యుత్‌ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుంచి విద్యుత్‌ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు.  

రోజుకు 55 మిలియన్‌ యూనిట్ల కొరత 
రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్‌ 235 మిలియన్‌ యూనిట్లు ఉండగా 150 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉందని పెద్దిరెడ్డి చెప్పారు.  రోజుకు 55 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీన్లో 30 మిలియన్‌ యూనిట్లను విద్యుత్‌ ఎక్సే్ఛంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేసున్నామన్నారు. గృహవిద్యుత్‌ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లోను 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.  బొగ్గుసరఫరాలో ఎదురవుతున్న సమస్యల కారణంగా థర్మల్‌ ప్లాంట్లలో విద్యుత్‌ వినియోగానికి పరిమితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, నెడ్‌క్యాప్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు