మైనింగ్‌ లీజులన్నీ బాబు హయాంలోనే

15 Jul, 2022 04:22 IST|Sakshi
మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి, చిత్రంలో టీటీడీ బోర్డు సభ్యుడు అశోక్‌కుమార్, మైనింగ్‌ అధికారులు

సిమెంట్‌ కంపెనీల్లో లేటరైట్‌ వినియోగం 3 శాతమే : మంత్రి పెద్దిరెడ్డి 

దాని కోసం వేల లారీలు తవ్వుకుని ఏం చేసుకుంటారు? 

శాటిలైట్‌ చిత్రాలతో ఎప్పటికప్పుడు మైనింగ్‌ పర్యవేక్షణ 

అక్రమార్కులకు రూ.114 కోట్ల జరిమానా 

రుషికొండలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదు

తిరుపతి రూరల్‌: జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని ఉత్తమ పనితీరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సాధించిన రాష్ట్ర గనుల శాఖపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు చేయడాన్ని గనులు, విద్యుత్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విశాఖలో కొండలను కొల్లగొడుతున్నారంటూ చంద్రబాబు చెబుతున్న గాలి కబుర్లలో ఏమాత్రం నిజం లేదన్నారు. గురువారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్, గనులశాఖ డీడీ ప్రసాదరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

పర్యావరణ అనుమతుల ప్రకారమే రుషికొండలో మట్టి తవ్వకాలు జరిగాయని, ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్ల రాయల్టీ కూడా చెల్లించిందని వివరించారు. చంద్రబాబు చెబుతున్న మైనింగ్‌ లీజులన్నీ కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఇచ్చారని గుర్తు చేశారు. కుప్పంలో రౌడీయిజం సంస్కృతి చంద్రబాబుదేనని, తమకు ఆ అలవాటు ఉంటే ఆయన అక్కడ గెలిచేవారు కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉండగా అటవీ ప్రాంతంలో జరిగిన దొంగచాటు మైనింగ్‌ను తాము రాగానే నిలుపుదల చేసినట్లు చెప్పారు. 

పది రోజుల్లో నివేదిక.. 
కుప్పం నియోజకవర్గంలో 102 మైనింగ్‌ లీజులున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు లీజులు మాత్రమే ఇచ్చాం. మిగిలినవి టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చినవే. ఇందులో 71 లీజులకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి రూ.114 కోట్ల పెనాల్టీ వేశాం. వర్కింగ్‌లో ఉన్న 31 లీజులపై పూర్తి స్థాయిలో విచారించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించాం. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాం. 

ఇంగిత జ్ఞానం లేకుండా.. 
సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌ను  రాజకీయంగా ఎదుర్కోలేక లేటరైట్‌ పేరుతో బురద చల్లాలనే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. భారతీ సిమెంట్‌కు రోజూ 1,000 లారీల లేటరైట్‌ తరలిస్తున్నారనే ఆరోపణలు అర్థరహితం. సిమెంట్‌ తయారీలో కేవలం 3 శాతం మాత్రమే లేటరైట్‌ వినియోగిస్తారు. వేల లారీల ఖనిజాన్ని సిమెంట్‌ కంపెనీలు ఏం చేసుకుంటాయి? ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం. 

రూ.100 కోట్ల జరిమానా మరిచావా? 
చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా పట్టించుకోలేదు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి చంద్రబాబు మరిచిపోయారా? మా ప్రభుత్వం వచ్చాక ఇసుక మాఫియాకు చెక్‌ పెట్టి అత్యంత పారదర్శక విధానాన్ని తెచ్చాం. కేంద్ర సంస్థల ద్వారా ఇసుక టెండర్లు నిర్వహించాం.

వనరులపై కాగ్‌ పర్యవేక్షణ..
మైనింగ్, ఇసుక అక్రమాలు, అక్రమ తవ్వకాలను నిరోధిస్తూ ప్రతి జిల్లాలో విజిలెన్స్‌ స్క్వాడ్‌ను నియమించాం. రీజినల్‌ స్క్వాడ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.  కాగ్‌ సహజ వనరులపై ఎప్పటికప్పుడు శాటిలైట్‌ ఇమేజింగ్‌ సిస్టం ద్వారా పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా అక్రమాలను గుర్తిస్తే కాగ్‌ వెంటనే రాష్ట్రాలను ప్రశ్నిస్తోంది. మన రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఇప్పటివరకు కాగ్‌ నుంచి ఫిర్యాదులు లేవు.

గనులశాఖ సమర్థతకు ఇది నిదర్శనం. అందుకే కేంద్ర ప్రభుత్వం మన గనుల శాఖకు జాతీయ స్థాయి అవార్డు ఇచ్చింది. రూ.2.40 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. మైనింగ్‌ శాఖలో తెచ్చిన సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది. సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అనుభవించిన చంద్రబాబుకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు. శాటిలైట్‌ సిస్టమ్‌ గురించి తొలుత ఆయన తెలుసుకోవాలి. 

మరిన్ని వార్తలు