నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు

7 Feb, 2021 04:42 IST|Sakshi

ఎస్‌ఈసీ ఆంక్షలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం

చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ ఆరాటం

బాబుకు తెలియకుండానే యాప్‌ తయారైందా? 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చౌదరి తాపత్రయం. ఈ క్రమంలో తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఎస్‌ఈసీకి మూడేళ్ల జైలు శిక్ష తప్పదు’ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తనపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విధించిన ఆంక్షలపై ఆయన స్పందించారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ నిధులతో పనిచేస్తూ ఎస్‌ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.


రిటైర్డ్‌ ఐఏఎస్‌ను చంద్రబాబు ఎస్‌ఈసీ సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి, దురాలోచనలతో పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ఖర్చులకు రూ.43 లక్షలు చెల్లించాల్సిందిగా కోరితే ప్రభుత్వం ఇచ్చిందని, ఖర్చులకు మరో రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టులో దావా వేశారన్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేస్తూ, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఇష్టానుసారం చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ‘చంద్రబాబుకు తెలియకుండా యాప్‌ తయారైందా? చంద్రబాబు తయారు చేసిన యాప్‌ను నిమ్మగడ్డ అమలు చేశారా?’ అని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి కాపలా కుక్కలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు