‘ఎన్ని మందలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరు’

21 Oct, 2022 16:18 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: పవన్, చంద్రబాబు బంధంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందే తాను ఎస్వీయూ అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. ఏ రోజు కూడా వాడు, వీడు అని ఎవరిని మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆయన దత్తత పుత్రుడు పవన్‌ కల్యాణ్‌ తప్పుడు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ ఉపయోగించిన భాష చాలా దారుణమని.. తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మనం మాట్లాడే భాష మంచిగా ఉండాలని హితవు పలికారు.

రాష్ట్రంలో చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్న పవన్‌  గురించి రాష్ట్ర మహిళలే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితమవుతారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణ నాయకుడని, ఆయన్ను ఎదురించాలంటే చంద్రబాబుకు ధైర్యం, బలం సరిపోదన్నారు. అందుకే తోక పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. అందరూ కలిసి వచ్చినా సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరని పేర్కొన్నారు.

‘పులి ఒక్కటే వేటకు పోతుంది కానీ.. గుంపులు గుంపులుగా.. మందలు మందలుగా పోదు. ఏపీలో ఎన్ని మందలు వచ్చినా.. ప్రజల అభిమానంతో 2024ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించడం ఖాయం. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే.. ఒకరు మన నాయకుడిని అన్యాయంగా ఇబ్బందులకు గురిచేస్తే.. మరొకరు సొంత మామకే వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్తూరు జిల్లాకు చెడ్డపేరు తీసుకొచ్చారని’ పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు