పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై చంద్రబాబు దాడి

11 Sep, 2022 05:20 IST|Sakshi
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

అమరావతి పరిరక్షణ సమితికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబే..

బాబు కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణం

విశాఖ పరిపాలన రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు: అమరావతి పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు చేస్తున్న దాడి.. అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..  ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణమని, ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అన్ని వసతులు ఉండి, ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంను పరిపాలన రాజ ధానిగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు.

చంద్రబాబు వేసిన కమిటీ తప్ప మిగతా ఏ కమిటీలూ అమరావతిని రాజధానిగా చేయాలని సూచించలేదని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనన్నారు. బాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు అనడం ఆయనకు వయసు పైబడిందని చెప్పటానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు, అక్కడ స్థిర, చరాస్తులు దోచుకున్న వారి పరిరక్షణే బాబు ధ్యేయమన్నారు.

అక్కడి ఆస్తులు అధిక ధర పలకాలని, మిగిలిన ప్రాంతాలు ఆర్థికంగా, రాజకీయంగా, ప్రాంతీయంగా అన్యాయమైనా పర్వాలేదనే దుష్టబుద్ధితో చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న కుటిల రాజకీయ యత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏమైనా ఘటనలు జరిగినా.. దానికి ఈ డ్రామాను ఆడిస్తున్న చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధా నులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని తెలి పారు. మూడు రాజధానుల తోనే సమన్యాయం, సమధర్మం, అభివృద్ధి సాధ్యమవుతుందని పునరు ద్ఘాటించారు. టీడీపీ కుటిల రాజకీయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, యువత అర్థం చేసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు