Pegasus: ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లో ఖేల్‌ దివస్‌..దీదీ ఫైర్‌

21 Jul, 2021 15:43 IST|Sakshi

బీజేపీకి  వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి: బెంగాల్‌ సీఎం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లోను ఖేలా దివస్‌

పిల్లలందరికీ ఫుట్‌బాల్స్‌ పంపిణీ

రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పైవేర్లకు కోట్లు ఖర్చు చేస్తారు: దీదీ

పెగాసెస్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి

సాక్షి, కోల్‌కతా: సంచలన పెగాసస్‌ స్పైవేర్‌ కుంభకోణంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.  విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్‌ చేస్తోందనీ, సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ కూలదోసిందంటూ మమతా  ఆగ్రహం వ్యక్తం చేశారు. "మిస్టర్ మోదీ...నేను మీపై వ్యక్తిగతంగా దాడి చేయటం లేదు. కానీ మీరు, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు, చివరికి బీజేపీ మంత్రులనే నమ్మలేదు’’ అంటూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో బుధవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన దీదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రతిక్షాలకు పిలుపు నిచ్చారు.

ప్రజాస్వామ్య మూలస్థంభాలైన మూడు (మీడియా, న్యాయ, ఎన్నికల కమిషన్) వ్యవస్థలను పెగాసస్‌ ఆక్రమించుకుందని దీదీ మండిపడ్డారు. పేద ప్రజలకు తగినంత  నగదును అందుబాటులో  ఉంచమంటే, కోట్లాది రూపాయలను మోదీ స్పైయింగ్‌ గిరీకి వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పైవేర్లకు కోట్లు ఖర్చు చేస్తారన్నారు. పెగాసెస్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఢిల్లీలో జులై 27 లేదా 28 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల భేటీ ఏర్పాటు చేయాలని, తాను హాజరుకానున్నట్టు  మమత చెప్పారు.

ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ అతి ప్రమాదకరం, భయంకరమైందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయింది ఇపుడిక తాను ఇతర ప్రతిపక్ష నాయకులతో గానీ, ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడలేనంటూ మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖేలా హోబె నినాదంతో మోదీ సవాల్‌కు విసిరిన దీదీ ఇపుడిక దేశంనుంచి బీజేపీని తరిమికొట్టే దాకా ఖేలాహోబె దివ‌స్ జరపాలన్నారు. ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లోను ఖేలా దివస్‌ నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో పేద పిల్లలకు ఫుట్‌బాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ట్యాపింగ్‌ కారణంగా  ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసా.. ఇక కేంద్రానికి ప్లాస్టర్‌ వేయాల్సిందే అని దీదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మనీ, మజిల్‌, మాఫియాకు వ్యతిరేకంగా నిలబడిన బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓగ్రూప్‌ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేసిందన్న ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలే ప్రధాన లక్క్ష్యంగా గూఢచర్యానికి పాల్పడిన వైనం రోజు రోజుకు మరింత ముదురుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తదితరులతోపాటు మమతా మేనల్లుడు, పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఇందులో ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు