విజయవాడ సెంట్రల్‌, పెనమలూరు టీడీపీలో అసమ్మతి జ్వాలలు

14 Dec, 2022 21:11 IST|Sakshi
బోడె ప్రసాద్‌పై సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పోస్టు  

సాక్షి, విజయవాడ: వరుస పరాజయాలను మూటకట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ మరింతగా దిగజారుతోంది. పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి బుసలు కొడుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌పై ఆ పార్టీ నాయకులు ఏకంగా సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాలుగు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద మరొకరు కారాలూ మిరియాలు నూరుకొంటున్నారు.   

బోడెపై తీవ్ర వ్యతిరేకత 
మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘అసమర్థుడు, చిత్తశుద్ధి లేదు, అవినీతిపరుడు, అధికార దుర్వినియోగం’ చేశాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా టీడీపీలోని ఓ వర్గం బోడెపై తీవ్ర స్థాయిలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్‌ (వైవీబీ), పండు వర్గాలు, బోడె ప్రసాద్‌పై బహిరంగంగానే విమర్శల దాడి చేస్తున్నాయి. ‘మీకు బదులు వేరే వాళ్లతో పరీక్షలు రాయిస్తూ పట్టుబడిన మాట వాస్తవం కాదా’ అంటూ బోడెను ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన కంకిపాడు, పెనమలూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు బోడె ప్రవర్తనతో విసిగి పార్టీ మారారంటూ నిందిస్తున్నాయి.  

చదవండి: (అనకాపల్లి.. ఇదేం లొల్లి..?)

కోడిపందేలు, పేకాటతో అపఖ్యాతి 
బోడె ప్రసాద్‌ ఈడుపుగల్లులో కోడిపందేలు, పేకాట, క్యాసినో సంస్కృతిని తెచ్చి, ఆయా జూదాల నిర్వాహకుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన వైనాన్ని వ్యతిరేక వర్గం నాయకులు ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పటికీ కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్, క్యాసినో నిందితులతో అంతర్గత వ్యాపారం ఉన్న మాట వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. వారితో కలిసి పట్టాయి, బ్యాంకాక్, దుబాయ్, మహాబలిపురం తదితర ప్రాంతాలకు ఇటీవలే వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

గతంలోనే ఈడుపుగల్లులో సంక్రాంతి సంబరాలకు క్యాసినో పెట్టాలని గోవా నుంచి యువతులను, సామగ్రిని తెచ్చి హోటల్‌లో ఉంచిన విషయాన్ని మరిచారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఆయన అభిమానులు ఆహ్వానిస్తే, అహంకారంతో వ్యవహరించిన బోడె తీరును ఇంకా మర్చిపోలేదంటూ గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తల పరిస్థితి ఏమిటని సోషల్‌ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే బోడె ప్రసాద్‌ను నిలదీయడం పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. ఓడిపోయినా తీరుమారని బోడే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో వైపు సర్పంచ్‌ల సంఘం దొంగ డ్రామాలు అంటూ వైవీబీ వర్గంపై బోడె వర్గం ఎదురుదాడి చేస్తోంది. 

సెంట్రల్‌లో నాలుగు ముక్కలాట
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం టీడీపీలో నాలుగు ముక్కలాట సాగుతోంది. నియోజకవర్గంలో బొండా ఉమా సొంతంగా ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వద్దకు కొత్తగా వచ్చిన నాయ కుడు ఒకరు నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవ హరిస్తున్నాడు. దీంతో ఆది నుంచి టీడీపీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు బొండా ఉమాకు దూరమయ్యారు. ఈ నియోజకవర్గంలో బొండా ఉమాది ఓ వర్గం. కేశినేని చిన్నిది మరో వర్గం. వంగవీటి రాధాది ఇంకో వర్గం. పార్టీని మొదటి నుంచి వెన్నంటి ఉన్నవారు నాలుగో వర్గంగా విడిపోయారు.

ఈ నాలుగు గ్రూపులు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ, పార్టీలో అసమ్మతిని రాజేస్తున్నారు. ఇటీవల 63 డివిజన్‌ పరిధిలో అన్నా క్యాంటీన్‌ వద్ద ఇరువర్గాలు ఎదురుపడి పరస్పరం తిట్ల పురాణంతో రెచ్చిపోయాయి. చొక్కాలు పట్టుకొని కొట్టుకొనేంత స్థాయికి వెళ్లడంతో అక్కడే ఉన్న పోలీసులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. పార్టీ నాయకులే గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య అసమ్మతి పార్టీ పుట్టి ముంచడం ఖాయమనే భావన సొంత పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు