సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్‌ పంచాయితీ!

16 Jan, 2023 07:42 IST|Sakshi

పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం.

సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు
ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. 

తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం
మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేనే గొప్ప.. నాకే కావాలి
గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.

ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు