ప్రజల్ని ప్రశ్నించకుండా చేసేందుకు.. విభేదాలు సృష్టిస్తున్నారు

22 Sep, 2023 05:57 IST|Sakshi

దుర్గ్‌: ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ వారిని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కులం, మతం ఆధారంగా ప్రజల్లో విభేదాలు కల్పించి, వారిని ప్రశ్నించకుండా చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని విమర్శించారు. గురువారం ఆమె చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘మహిళా సమృద్ధి సమ్మేళన్‌’లో ప్రసంగించారు. ఒకవైపు ప్రధాని మోదీ సన్నిహితులైన పారిశ్రామిక వేత్తలు రోజుకు రూ.1,600 కోట్లు పోగేసుకుంటుండగా మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలతో జనం పడుతున్న ఇబ్బందులపై కేంద్రం మాట్లాడటం లేదన్నారు.

ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ తన సొంత నియోజకవర్గంలో పర్యటనలో ఉండగా జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘నాన్న వైపు చూస్తూ ఓ మహిళ కేకలు వేస్తోంది. అక్కడ రోడ్లు బాగోలేవని ఆమె ఆరోపిస్తోంది. నాన్న వాహనం దిగి ఆమె వద్దకు వెళ్లి సమాధానం చెప్పారు. వాహనంలోకి వచ్చాక ఆ మహిళ తీరు చూసి మీరేమైనా బాధపడ్డారా?అని అడిగా. ‘లేదు, ప్రశ్నించడం వాళ్ల పని. సమాధానం ఇవ్వడం నా కర్తవ్యం అని ఆయన అన్నారు’అని ప్రియాంక చెప్పారు. ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉండాలని అప్పట్లో ప్రధానమంత్రి సైతం భావించేవారని ఆమె వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు