AP: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు

14 May, 2022 11:17 IST|Sakshi

చెప్పిందే చెబుతూ!

స్పందన లేని బాబు పర్యటన

జనాన్ని రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యం

సభలకు జనం రాకపోవడంతో కేడర్‌పై  అధినేత అసంతృప్తి

పలమనేరు(చిత్తూరు జిల్లా): కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన, తెలుగు తమ్ముళ్లను,  జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు ఆద్యంతం చెప్పిందే చెబుతూ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని నింపేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఓటమి చెందినా టీడీపీ అసలు పోటీనే చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఆపై మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ చతికిలబడింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో అక్కడి టీడీపీ క్యాడర్‌కు అర్థంకాలేదు. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు తగ్గుతున్న ఆదరణకు ఆయన ముందుగానే పసిగట్టి ఎలాగైనా కుప్పంలో మళ్లీ నిలదొక్కుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు పర్యటన సాగింది.
చదవండి: టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి

గత లోకల్‌బాడీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమితో చంద్రబాబు వేరే నియోజకవర్గానికి వెళతాడంటూ అక్కడి జనం చెప్పుకోవడంతో ఈ సారి జాగ్రత్త పడ్డారు. తాను కుప్పంనుంచి ఎక్కడికి వెళ్లనంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడే మెడికల్‌ కళాశాల పక్కన స్థలం చూశా, ఇల్లు కట్టుకుంటాను అని ప్రజలకు ప్రమాణం చేసి చెప్పాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకనే గుసగుసలు మొదలయ్యాయి.

ప్రసంగాలకు నో రెస్పాన్స్‌  
బాబు పర్యటనలో తొలిరోజు శాంతిపురం మండలంలో ఆ పార్టీ నాయకులు మినహా స్థానికులు కనిపించలేదు. అనికెర, రేగడదిన్నేపల్లి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సొంత గ్రామమైన వెంకటేపల్లె్లలో సభలు వెలవెలబోయాయి. బోయనపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమానికి జనం నుంచి స్పందన లేకుండా పోయింది. ప్రభుత్వంపై ఎన్ని రకాల ఆరోపణలు, విమర్శలు చేసినా జనం పట్టించుకోలేదు.

ట్రెండ్‌ మార్చినా లాభం లేదే... 
తన రెండోరోజు పర్యటనలో కుప్పం స్థానిక సమస్యలపై మాట్లాడారు. కానీ జనం నుంచి రెస్పాన్స్‌ రాలేదు. దీంతో అక్కడి నాయకులపై మండిపడినట్టు సమాచారం. ఇక్కడ నాయకులంతా వినాయకుల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తన మూడు రోజుల కుప్పం పర్యటలో అనుకున్నది జరగలేగదనే ఫ్రస్టేషన్, తమ్ముళ్లు పనికిరాకుండా పోయారనే అసంతృప్తి చంద్రబాబు మొహంలో కనిపించింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానిపై బాబు ఫైర్‌ 
కుప్పం: నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కవరేజికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్‌ ‘సార్‌ ఇతను కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు శివను చూసి హెచ్చరికలు చేశారు. అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు.   

మరిన్ని వార్తలు