‘మోదీని చూసి ఎవ‌రూ ఓట్లు వేయ‌రు’

28 Aug, 2020 14:34 IST|Sakshi

డెహ్రాడున్: పార్టీ నేత‌ల‌ను చూసి కాక‌పోయినా అధ్యక్షుడిని చూసైనా ఓట్లు రాల‌తాయంటారు. కానీ ఉత్త‌రాఖండ్ బీజేపీ అధ్య‌క్షుడు బ‌న్‌సిందార్ భ‌గ‌త్ మాత్రం ఇందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర ‌మోదీని చూసి ప్ర‌జ‌లు మ‌న‌కు ఓట్లు వేయ‌ర‌ని తేల్చి చెప్పారు. 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోదీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించ‌లేర‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప‌ని చేస్తేనే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ఇదివ‌ర‌కే మోదీ ముఖం చూసి ఓట్లు వేశార‌ని, కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌రిస్థితి ఉండ‌బోద‌ని చెప్పారు. (చ‌ద‌వండి: అది విశ్వాసఘాతుకమే!)

కేవ‌లం ఎమ్మెల్యేల‌ ప‌నితీరు ఆధారంగానే ఓట్లు వేస్తార‌ని చెప్పుకొచ్చారు. మోదీ పేరుతో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నుకోవ‌డం వృథా ప్ర‌యాసేన‌ని తెలిపారు. అలాగే రానున్న ఎన్నిక‌ల్లో నేత‌ల‌ వ్య‌క్తిగ‌త ప‌నితీరు ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించిన‌ కాంగ్రెస్.. మోదీ హ‌వా త‌గ్గింద‌ని ఒప్పుకుంటున్న బ‌న్‌సిందార్ వ్యాఖ్య‌ల‌ను స్వాతిస్తున్నామ‌ని తెలిపింది. మోదీ హ‌వా తగ్గిపోవ‌డం వ‌ల్లే ఆయ‌న ‌త‌న ఎమ్మెల్యేల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న మెరుగుప‌ర్చుకోమ‌ని సూచించార‌ని ఆ రాష్ట్ర‌ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్య‌కాంత్ ధ‌స్మానా అన్నారు. (చ‌ద‌వండి: దేశ ఆర్ధిక వ్యవస్థపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు