మంత్రుల పర్యటనల్లో విపక్షాల అరెస్టులా?

31 May, 2023 01:47 IST|Sakshi

అధికార నేతలకు పోలీసుల్లేకుండా ప్రజల వద్దకు వచ్చే దమ్ముందా? 

ప్రభుత్వాన్ని నిలదీసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

అచ్చంపేటలో మంత్రి హరీశ్‌ పర్యటన వేళ విపక్ష నేతల్ని  అదుపులోకి తీసుకోవడంపై ధ్వజం  

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర 

పెద్ద కొత్తపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు వెంట లేకుండా ప్రజలకు వద్దకు వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా? అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పోలీసు భద్రత లేకుండా తిరిగితే వారి పరిస్థితి ఏమిటో అప్పుడు అర్థమవుతుందన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో కొనసాగింది.

ఈ సందర్భంగా చంద్రకల్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు అచ్చంపేటలో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించడానికి వస్తే కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రులు వస్తున్నప్పుడు ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రజలను కలవకుండా ప్రారంబోత్సవాలు చేసుకోవడం దేని కోసమని భట్టి ప్రశ్నించారు.

‘ప్రజలేమైనా దోపిడీదారులా, దొంగలా.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఏమైనా నిషేధించారా?’అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే అధికార పార్టీ నాయకులను సైతం అరెస్టు చేయించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. పాలకులు చెప్పినట్లు కాకుండా పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటానికి వ్యవస్థీకృతమైన పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేసేలా ఉండాలని భట్టి సూచించారు.

తప్పులు చేస్తున్న అధికారుల లెక్కలు రాస్తున్నామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి పాలించడం కాదని.. ప్రజల హృదయాలు గెలిచి పరిపాలన సాగించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు