సభా సంప్రదాయాలకు టీడీపీ పాతర

23 Mar, 2022 02:52 IST|Sakshi
పేర్ని నాని , గుడివాడ అమర్‌నాథ్‌

శాసనసభలో విజిల్సా : మంత్రి పేర్ని నాని మండిపాటు

కోడి పందేలా.. సినిమా హాలా?

స్పీకర్‌పై కాగితాలు చింపి ఎగరేస్తారా?

ఇంత బరి తెగింపు ముందెన్నడూ చూడలేదు 

పెగసస్‌పై మాట్లాడలేక పారిపోయారు : గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, అమరావతి: ‘కోడిపందాల వద్ద, సినిమా హాళ్లలో విజిల్స్‌ వేసినట్టుగా శాసనసభలో విజిల్స్‌ వేస్తూ.. గేలి చేస్తూ టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇంత బరి తెగింపు ముందెన్నడూ చూడ లేదు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ సభ్యులు హేయమైన రీతిలో గాలితనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు శాసనసభ సభ్యులో.. ఆకతాయిలో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ‘ఈ రోజు ఇంకా దిగజారి విజిల్స్‌ కూడా వేస్తూ దారుణంగా ప్రవర్తించారు.

ప్రజలు అవకాశం ఇచ్చి ఇక్కడికి పంపినప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలో హుందాగా వ్యవహరించాలే తప్ప మరీ ఇంతగా బరి తెగించకూడదు. గత్యంతరం లేక టీడీపీ సభ్యులను సభ నుంచి పంపుతున్నాం. టీవీలో చూస్తోన్న చంద్రబాబును సంతృప్తి పర్చడమే ధ్యేయంగా సభలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ అంటే కోడి పందేల దిబ్బగా దిగజార్చుతున్నామనే స్పృహ కూడా లేదు. ఇలాంటి వాళ్లకు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు. కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం వంటి చర్యలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాని పేర్కొన్నారు.

ఏబీవీ.. పోలీస్‌ అధికారిగా వ్యవహరించండి
ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్‌ అధికారిగా కాదు.. కనీసం హోంగార్డుగా కూడా పనికిరాని వ్యక్తి అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతగా కాకుండా ఓ పోలీసు ఆఫీసర్‌గా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు మా మీద పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు. మీతో పాటు టీడీపీ మీద ఐదు కోట్ల ఆంధ్రులు పరువునష్టం దావా వేస్తారు. సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడని ఏబీవీ అంటున్నారు.

ఐపీఎస్‌గా 30 ఏళ్ల సర్వీసులో ఉండి మిమ్మల్ని మీరే కాపాడుకోకపోతే పోలీస్‌ అధికారిగా మీరు అన్‌ఫిట్‌ కదా! పెగసస్‌ స్పై వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేసినట్టుగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఎక్కడా మాట్లాడ లేదని లోకేష్‌ చెబుతున్నారు. ఆమె ఆ విషయం చెప్పకపోతే నువ్వెందుకు ట్వీట్‌ చేశావ్‌ లోకేష్‌? మీ గెజిట్‌ ఈనాడులో కూడా వార్తలు వచ్చాయిగా.. కన్పించ లేదా? ఓ సీఎం చెప్పిన విషయంపై చర్చించకుండా ఎలా ఉండగలం? సభలో ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకో పారిపోయారు. వాళ్లే కొనుగోలు చేస్తారు. మళ్లీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే ఒకరికొకరు వత్తాసు పలుకుతుంటారు’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు