అన్నింటా వైఎస్సార్‌సీపీదే విజయం

8 Mar, 2021 05:03 IST|Sakshi

అమరావతికి నువ్వు చేసిందేంటి బాబూ?

జగన్‌ పాలనను జనం కోరుకుంటున్నారు

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను పవన్‌ ఆపొచ్చుగా..

మంత్రి పేర్ని నాని 

సాక్షి, అమరావతి: విజయవాడతో సహా, రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, పురపాలకసంఘాలు, నగర పంచాయతీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధీమా వ్యక్తంచేశారు. వైఎస్‌ జగన్‌ పాలనను ఆశీర్వదిస్తూ ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయబోతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. విజయవాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో దోచుకున్నదంతా తన హెరిటేజ్‌ సంస్థలో పెట్టి, తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు. ఆయన ఇంకేమన్నారంటే..

దోచుకోవడం తప్ప చేసిందేంటి? 
అమరావతికి చంద్రబాబునాయుడు  చేసిందేంటి? రైతులను బెదిరించి వేల ఎకరాలు దోచుకున్నారు. రూ.3 వేల కోట్ల ప్రజాధనంతో తాత్కాలిక భవనాలు, వర్షం వస్తే నీళ్లు కారే అసెంబ్లీ, సెక్రటేరియట్‌ కట్టారు. ట్రాఫిక్‌ రద్దీ ఉన్న విజయవాడలో కనీసం బైపాస్‌ వేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగాలొచ్చే ఒక్క పరిశ్రమా తీసుకురాలేదు. గ్రాఫిక్స్‌తో మోసం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ 54 వేల మంది నిరుపేదలకు అమరావతిలో ఆశ్రయం కల్పిస్తుంటే దానినీ అడ్డుకున్నారు. కుప్పం అంటే ప్రాణమని అక్కడ, నిద్రలో విశాఖే గుర్తుకొస్తుందని విశాఖలో.. బెజవాడను బాగుచేశానని ఇక్కడా చెప్పారు. ఇందులో ఏది నమ్మాలి. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు.  

అమ్మవారు తగిన శాస్తి చేసింది
దుర్గమ్మతో పెట్టుకున్నారు కాబట్టే చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చింది. బావమరుదులు, ప్రజలే కాదు.. ఇప్పుడు కార్యకర్తలూ ఆయనకు దూరమ వుతున్నారు. అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసిన ఆయ న్ని అమ్మవారు ఎందుకు క్షమిస్తుంది? తగిన శాస్తి చేసింది. భవిష్యత్‌లో ప్రభుత్వం పన్నులు పెంచుతుందని బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవకాశం ఉంటే 15 శాతానికి మించి పెంచొద్దని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలనూ వక్రీకరిస్తున్నారు. అసలు నీటి పన్నులను వందశాతం పెంచమంది ఆయనే. దేశంలో అత్యధిక పాపాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనో ముసలి రౌడీ. సీఎం జగన్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం మంది ఓటేస్తే.. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం వేశారు. ఈయనకు తగ్గట్టే పవన్‌కల్యాణ్‌. బీజేపీతో అంటకాగుతున్న వ్యక్తి విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపొచ్చుగా. ఇదేదీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని  విమర్శించడం అర్థరహితం.  

మరిన్ని వార్తలు