అన్ని స్థానాల్లో సైకిల్‌ గుర్తు ఉంటుందా?: పేర్ని నాని

2 Apr, 2023 15:06 IST|Sakshi

 వైఎస్సార్‌సీపీని ఎలా ఓడిస్తావ్‌ బాబూ? ∙నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని

38 నియోజకవర్గాల్లో అభ్యర్థులకే దిక్కు లేదు.. 175 స్థానాల్లో పోటీ చేస్తావా?

పవన్‌ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇస్తున్నావ్‌?.. 

బీజేపీ ముసుగులో టీడీపీ జెండా మోస్తున్న సత్యకుమార్,   ఆదినారాయణరెడ్డి, సుజనా చౌదరిలకు ఎన్ని సీట్లు ఇస్తున్నావ్‌? 

టీడీపీకి సీపీఐని తాకట్టు పెట్టిన నారాయణ, రామకృష్ణలకు సీట్లు ఇస్తావా?

రాహుల్‌ గాంధీకి ఎన్ని సీట్లు ఇస్తావ్‌?

కంగారు పడకుండా తొలుత వాటిపై స్పష్టత తెచ్చుకో 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని ఓడిస్తానంటూ ఏప్రిల్‌ 1న (ఫూల్స్‌ డే) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీరాలు పలుకుతూ సీఎం వైఎస్‌ జగన్‌ను దూషిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందాడని మాజీ మంత్రి పేర్ని         వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. అసలు 175 నియో­జకవర్గాల్లో సైకిల్‌ గుర్తుపై అభ్యర్థులను పోటీకి పెడతావా? అంటూ నిలదీశారు. మూణ్నెల్ల క్రితం టీడీపీ నేతలతో సమావేశమై.. 38 నియో­జక­వర్గాలలో పార్టీకి ఇన్‌ఛార్జ్‌లే లేరంటూ వాపోయిన దిక్కుమాలిన స్థితి చంద్రబాబుదేనన్నారు. ‘ముందు ఆ 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతుక్కో.. కంగారెందుకు? ఎన్నికలకు మరో ఏడాది ఉంది కదా’ అంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

 175 నియోజకవర్గాల్లో పవన్‌ కళ్యాణ్‌కు ఎన్ని ఇస్తున్నావ్‌? బీజేపీలో ఉంటూ టీడీపీ జెండా మోస్తున్న సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి, సుజనా చౌదరి వంటి వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నావ్‌?  

పేరుకేమో ఎర్ర జెండా. దాన్ని పసుపు రంగులో ముంచి భుజాన వేసుకుని తిరుగుతూ.. టీడీపీకి సీపీఐని తాకట్టు పెట్టిన నారాయణ, రామకృష్ణలకే సీట్లు ఇస్తావా? ఇంకెవరికైనా ఇస్తావా? ఇంకా రాహుల్‌ గాంధీకి ఎన్ని సీట్లు ఇస్తావ్‌? వీటిపై నీకు స్పష్టత ఉందా? 

ఇంత మందిని పోగేసుకుంటే కానీ సీఎం వైఎస్‌ జగన్‌పై పోటీకి వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అయినా 75 ఏళ్ల వయసులో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా అబద్ధాలు, అసత్యాలు, మసిపూసి మారేడుకాయ చేయడం, ఏమార్చటాలు.. ఈ వయసులోనూ చంద్రబాబు వీడ లేదు. 

175 చోట్లా పోటీ చేసే దమ్ము లేదు. స్థోమతా లేదు. పది మందిని కలుపుకుంటేగానీ సీఎం వైఎస్‌ జగన్‌పై పోటీ చేసే సాహసం చేయలేని దుస్థితి. కొడుకు కలిసి రాడు. జనం మెచ్చుకోరు. అందుకే దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బావమరిది బాలకృష్ణతో తిరిగి.. సినిమా డైలాగ్‌లు రాయించుకుని పంచ్‌ డైలాగులు వదులుతున్నాడు. 

చంద్రబాబు ఎన్ని పార్టీలను పోగేసుకొని వచ్చినా, ప్రజల హృదయాల నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ను ఇసుమంత కూడా తొలగించలేరు. 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయం. 

కుప్పంలో కార్యకర్త చేతిలో ఓడటం ఎందుకు?  
 ‘వైనాట్‌ పులివెందుల?’ అంటున్నారు కదా.. అలా అనే వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. పులివెందులలో జగన్‌ గారు ఓడిపోతారని కలలు కనే వారంతా వచ్చి పోటీ చేయండి. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌.. ఎవరైనా సరే పులివెందులలో పోటీ చేయొచ్చు. కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల చేతిలో ఓడిపోవడం ఎందుకు? పులివెందులలోనే పోటీ చేయండి. అక్కడే ఇద్దరూ పోటీ చేసినా ఫరవాలేదు. మీరో.. మేమో తేలిపోతుంది. 
 మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు గెలిచింది కేవలం నాలుగు. గ్రాడ్యుయేట్స్‌లో మూడు, ఎమ్మెల్యే కోటాలో ఒకటి.. దానికే చంకలు గుద్దుకోవడం ఏమిటో? ప్రపంచాన్ని జయించినట్లు, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు.

కర్నూలు డిక్లరేషన్‌ ఏమైంది? 
మందడంలో అమరావతి దీక్ష శిబిరం రోజూ ఖాళీగానే ఉంటుంది. వందో.. ఐదు వందల రోజు వంటి ఫ్యాన్సీ నంబర్‌ వచ్చినప్పుడు మాత్రం అక్కడికి చంద్రబాబు అద్దె మైక్‌గాళ్లను చంద్రబాబు పంపి.. సీఎం వైఎస్‌ జగన్‌పై కారుకూతలు కూయించడం ధర్మమా?  

పది దొడ్లు మారి చేరిన వారు నిజంగా బీజేపీ వాళ్లేనా? రాయలసీమలో రెండో రాజధాని పెట్టాలంటూ 2018లో బీజేపీ చేసిన కర్నూలు డిక్లరేషన్‌ ఏమైంది? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చెప్పిన మాటలు ఏమయ్యాయి?

 తన మనసుకైతే తమ ప్రభుత్వం వస్తే కర్నూలే రాజధాని అని ఆ నగర పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ అన్నాడు. అలాగే విశాఖ వెళ్లి ఈ ప్రాంతం రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న నగరం అన్నాడు. ఇప్పుడు బీజేపీ నేతలకు, పవన్‌ కళ్యాణ్‌కు సిగ్గు శరం లేవా? 

అమరావతి ప్రాంతంలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఉద్యమం చేస్తోన్న బహుజన పరిరక్షణ సమితి నేతృత్వంలోని దళితులపై బీజేపీ ముసుగులో టీడీపీ జెండా మోస్తున్న సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నాం. చంద్రబాబు పంచన ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి దళితులను ఎలా అవమానించాడో అందరికీ గుర్తుంది.

చదవండి: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


మరిన్ని వార్తలు