ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా?

1 Apr, 2021 06:06 IST|Sakshi

పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మెప్పుకోసమే పనిచేశారు

తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ

మంత్రి పేర్ని నాని ధ్వజం  

సాక్షి, అమరావతి: పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మేలు, మెప్పుకోసం పనిచేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఉద్యోగం ఊడిపోయే చివరిరోజున శ్రీరంగనీతులు చెబుతున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఉద్యోగం ఆఖరి రోజున ఎన్నికల సంస్కరణలంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో నిమ్మగడ్డ చేసిన సిఫారసులను చూస్తే ‘పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడనే’ సామెత గుర్తుకొస్తోందన్నారు. లేఖ ఉపోద్ఘాతంలో ఎన్నికలపై నిమ్మగడ్డ నిష్పక్షపాతం, పారదర్శకమనడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. గవర్నర్‌కు రాసిన లేఖలో ఏ ఒక్కటీ నిమ్మగడ్డ ఆచరించలేదన్నారు. అసలు ఎన్నికల నిబంధనల పట్ల ఆయనకు గౌరవం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ గుంటూరులో ఓటుహక్కు కావాలనడంలోనే ఆయన వైఖరి అర్థమైందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. 2016 నుంచి ఈరోజు వరకు చంద్రబాబు రక్షణే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు, బాధ్యతగా నిమ్మగడ్డ పనిచేశాడని విమర్శించారు.  పట్టపగలు బరితెగించి హోటల్‌కెళ్లి సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌తో గంటలకొద్దీ రాజకీయ మంత్రాంగం, యంత్రాంగం నడిపిన ఏకైక ఎస్‌ఈసీ నిమ్మగడ్డేనన్నారు.ఎన్నికల కమిషన్‌ అంటే రాజకీయపార్టీలకు దూరంగా ఉండాలని ఆయనంటుంటే ప్రజలు నవుక్వతున్నారన్నారు. ఓటుతో చంద్రబాబును భూస్థాపితం చేసి, నిమ్మగడ్డ దిమ్మతిరిగేలా చేశారన్నారు.

విజయవాడ అభివృద్ధికి సీఎం కీలక నిర్ణయం 
వరదల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసే కృష్ణలంక వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని నాని చెప్పారు. సీఎం జగన్‌ చొరవతో నిర్మించే రిటైనింగ్‌వాల్‌ వల్ల కృష్ణలంక వాసులు భవిష్యత్తులో ఎంత వరదొచ్చినా నిశ్చింతగా వారిళ్లలోనే హాయిగా జీవించవచ్చన్నారు. ‘‘రిటైనింగ్‌వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుడిపక్క జరిగే నిర్మాణ పనులపై ఆరా తీస్తూ, ఎడమపక్క ఎందుకు నిర్మాణం చేయట్లేదని అధికారులను ప్రశ్నించారు. పెద్దగా ముంపు రాదని వారనడంతో.. ముంపు వస్తుందా, రాదా అనేది కాదు, ఎంత పెద్ద వరదొచ్చినా ఇళ్లలోకి నీళ్లు వెళ్లకూడదన్నారు. వారధి నుంచి పుష్కరఘాట్ల వరకు తక్షణం ఎస్టిమేట్లు తయారుచేసి టెండర్లు పిలవాలని ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ను ఆదేశించారు’’ అని నాని తెలిపారు.  

మరిన్ని వార్తలు