అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం

20 Sep, 2020 04:19 IST|Sakshi

న్యాయ వ్యవస్థలో ఉన్నవారి కుటుంబ సభ్యులు అమరావతి భూకుంభకోణంలో ఉన్నారు

చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసేవారు న్యాయ వ్యవస్థలో ఉన్నారు

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  

సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా అమరావతి భూకుంభకోణంలో ఉన్నందునే సీబీఐ విచారణ కోరుతున్నామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. న్యాయ వ్యవస్థను టీడీపీ ఎలా భ్రష్టు పట్టిస్తోందో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారని, ఆయన చెప్పిన విషయాలపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

► అన్నిటితోపాటు న్యాయ వ్యవస్థను కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆయన క్షుద్ర రాజకీయం పార్లమెంటులో బయటపడుతుంటే టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. 
► ఒక రాజకీయ పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. చంద్రబాబు కోసమే ఇప్పటికీ వారు పనిచేస్తున్నారు. ఇలాంటివారు న్యాయ వ్యవస్థలో ఉంటే ఈ దేశంలో న్యాయం ఉంటుందని ఎలా అనుకోగలం?
► చంద్రబాబుకు వత్తాసు పలికే ‘ఈనాడు’ పత్రికలో పెట్రో బాంబ్‌ అంటూ పెద్ద వార్తా కథనం ప్రచురించడం చూస్తే..æ ధృతరాష్ట్రుడు కౌరవుల పట్ల, పాండవుల పట్ల ఎలా వ్యవహరించాడో.. అలాగే పక్షపాతంతో ఎల్లో మీడియా వ్యవహరిస్తోందనేది స్పష్టమవుతోంది. 
► గతంలో చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు రూ.4 చొప్పన వసూలు చేసిన డబ్బును ఎక్కడ ఖర్చు చేశారో చెప్పగలరా? ఈనాడు దృష్టిలో బహుశా అది పెద్ద వార్త కాదేమో! 
► కేంద్రం ఇప్పటివరకు లీటర్‌కు రూ.10 పెంచింది. ఇది రామోజీరావుకు కనిపించలేదా? అంటే ఆయనకు చంద్రబాబుపై ప్రేమ.. ప్రధాని నరేంద్రమోదీ అంటే భయం ఉంది. 
► పెట్రో సెస్‌ ద్వారా వచ్చిన డబ్బును రోడ్ల బాగుకు వినియోగిస్తామంటుంటే ఈనాడుకెందుకు అంత బాధ?. 

మరిన్ని వార్తలు