పవన్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా

5 Apr, 2021 05:37 IST|Sakshi

 మంత్రి పేర్ని నాని మండిపాటు

సాక్షి, అమరావతి: ‘జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞాన వాసి కూడా..’ అని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. తిరుపతిలో శనివారం పవన్‌ మాటలే ఇందుకు నిదర్శనమని విశ్లేషించారు. అద్దె మైకుగా పనిచేసే పవన్‌కు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవడం అలవాటైపోయిందన్నారు. రోజుకో పార్టీకి ఓటేయమని చెప్పే పవన్‌ను ముందు నిలదీయాల్సిన అవసరం ఉందని తిరుపతి ప్రజలు అంటున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

టీడీపీ–బీజేపీ ప్రాయోజిత కార్యక్రమం ద్వారా తిరుపతిలో పవన్‌ నాయుడు వినోదాన్ని అందించారని ఎద్దేవా చేశారు. 2014లో మోదీకి ఓటేయండని చెప్పి.. పది రోజుల్లోనే చంద్రబాబుతో రహస్య మంతనాలు చేసి, సైకిల్‌కు ఓటేయండని మాట మార్చారని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాది బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందని దూషించాడని, చిన్నçప్పటి నుంచి తనకు వామపక్ష భావ జాలం ఉందని చెప్పుకున్నాడని తెలిపారు. అలాంటి పవన్‌.. ఇప్పుడు మళ్లీ బీజేపీకే ఓటేయండనడంలో అర్థమేంటన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

దేవుడితో రాజకీయమా? తస్మాత్‌ జాగ్రత్త
► వైఎస్‌ జగన్‌ ఏడు కొండల మీదకు చెప్పులేసుకొచ్చాడని, ఎప్పటికీ సీఎం కాలేడని పవన్‌ అన్నాడు. కానీ సీఎం అయింది జగనే. రెండు చోట్ల ప్రజలు గుండు గీసింది పవన్‌కే. దేవుడిని రాజకీయాల్లోకి లాగితే ఇదే గతి పడుతుంది. 
► చంద్రబాబు నాయుడి ప్రభుత్వం గుళ్లను కూల్చేస్తే మాట్లాడని పవన్‌.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గుళ్లను ధ్వంసం చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. తిరుపతికొచ్చినా వెంకన్న స్వామిని దర్శించుకోని పవన్‌.. కొండమీద బ్యాగులమ్ముకునే వాళ్లను, టాక్సీ వాళ్లను ఎవరో బెదిరిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. 

వివేకా హత్యపై కేంద్రాన్ని ప్రశ్నించవేం? 
► వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తోంది. ఆయన కుమార్తె ప్రశ్నించింది సీబీఐని. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి దీన్ని ఆపాదించేందుకు పవన్‌ ప్రయత్నించడం దుర్మార్గం.
► అసలు ఆయన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడు? హత్య జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.  కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలొచ్చాయి. పవన్‌ దీన్ని ప్రశ్నించడేం? పవన్‌ అజ్ఞాత వాసే అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఆయన అజ్ఞాన వాసి కూడా అని అర్థమైంది. 

ఎప్పుడైనా ‘కాపు’ కాశావా?
► కాపులు, బలిజలకు కష్టమొచ్చినప్పుడు పవన్‌ ఏనాడూ మాట్లాడలేదు. బీసీల్లో చేర్చమని అడిగినందుకు చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టినా నిలదీయలేదు. అవసరం ఉంటే కులం కావాలి. ఎన్నికలొస్తే జనం కావాలి. తిరుపతిలో టీడీపీ మూడో స్థానంలోకి వెళ్తుందని పవన్‌ భయపడుతున్నాడు.
► చైనాలో ఆంధ్ర ఎర్ర చందనం డోర్‌ డెలివరీ జరుగుతుందంటే.. నాతో సహా కేంద్రంలోని మోదీ, అమిత్‌షా, కేంద్ర మంత్రులకు వాటాలున్నట్టే కదా? అలాంటప్పుడు మోదీకి ఓటేయమని ఎందుకు అడుగుతున్నావ్‌?
► ఆంధ్ర రాష్ట్రం విడిపోయినందుకు 21 రోజులు అన్నం మానేశానని చెప్పిన పవన్‌.. ఇప్పుడు బీజేపీతో కలిసి బిర్యానీ తింటున్నాడా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తానన్న బీజేపీకి ఓటేయమనడం ఏమిటి? 
► అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐ చేత విచారణ జరిపించమంటే కేంద్రం ముందుకు రాలేదు. దీన్నిబట్టి విగ్రహాల విధ్వంసం వెనుక బీజేపీ పాత్ర ఉందని పవన్‌ కళ్యాణ్‌ మాటలను బట్టి అనుమానం వస్తోంది. తిరుపతి ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలి. మనకోసం కష్టపడుతున్న వైఎస్‌ జగన్‌ను గెలిపించాలి.

   

మరిన్ని వార్తలు