Perni Nani: సీఎం జగన్‌ గ్రాఫ్‌ తగ్గించడం ఎవరితరం కాదు..

14 Jul, 2022 04:16 IST|Sakshi

దిగజారిపోతున్న పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ చేయించిన సర్వే అది 

ఆ సర్వే చేసిన సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థ.. టీడీపీ జీతగాడు రాబిన్‌శర్మది 

మున్ముందు ఎల్లో మీడియాలో మరిన్ని డూప్లికేట్‌ సర్వేలు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని  

సాక్షి,అమరావతి: ప్రజల బాగోగులే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తూ దేశ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్‌ను తగ్గించడం ఎవరితరం కాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, ఇలాంటి బూటకపు సర్వేలు వైఎస్‌ జగన్‌పై పని చేయవన్నారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగుకు వెళ్తున్న టీడీపీని కాపాడుకునేందుకు ఆ పార్టీ చేయించిన సీఎన్‌వో సర్వే అది అని చెప్పారు. ఆ సర్వే చేసిన సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థ.. టీడీపీ జీతగాడు రాబిన్‌శర్మదేనని తెలిపారు.

ఇలాంటి చెత్త సర్వేలు, డబ్బా సర్వేలను ఎల్లో మీడియాలో మున్ముందు  చాలానే ప్రచురిస్తారని చెప్పారు. ‘పవన్‌కల్యాణ్‌ ద్వారా టీడీపీ వారు గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారు.. అది సాధ్యం కాలేదు. ఇక టీడీపీలో తండ్రీ కొడుకుల వల్లా గ్రాఫ్‌ లేవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత.. జనం అంతా సీఎం జగన్‌ వైపు ఉన్నారని వాళ్లకి తెలిసిపోయింది. జోరు వాన, ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా మంది గుంటూరు వద్ద వాహనాలు ఆపి నడుచుకుంటూనే ప్లీనరీకి హాజరయ్యారు’ అని పేర్ని నాని గుర్తు చేశారు.

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు ఇలా దిగ్విజయంగా జరగడం చూసిన తండ్రీకొడుకులకు లాగులు తడుస్తున్నాయని, ఇక దత్తపుత్రుడికి మతి చలించిపోయి రాజకీయ ప్రవచనాలు మొదలెట్టారని ఎద్దేవా చేశారు. దీంతో చివరకు తన జీతగాళ్లతో ఇలాంటి డూప్లికేట్‌ సర్వేలను చేయించుకుని టీడీపీ వారు ఆనందపడిపోతున్నారని పేర్ని నాని చెప్పారు.  

జనం నమ్మరు 
సీఎం జగన్‌ గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉందని పేర్ని నాని అన్నారు. ప్లీనరీకి లక్షలాది మంది హాజరయ్యారని, విజయవంతమైందని ఎల్లో మీడియానే నిజాలు తెలియజేస్తోంటే.. ఇంకా సీఎం జగన్‌ గ్రాఫ్‌ తగ్గిందని మాట్లాడుతున్నారంటే.. వారికి మతి ఉన్నట్లా.. లేనట్లా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో పవన్‌ వేసే ప్రతి అడుగూ చంద్రబాబుకు ఏదో విధంగా బలం చేకూర్చేందుకేనన్నారు. పవన్‌కల్యాణ్‌ మార్చే రంగుల ముందు ఊసరవెల్లి కూడా చిన్నబోతుందని ఎద్దేవా చేశారు. బాబు, పవన్‌ల ఏడుపులను, ప్రవచనాలను జనం నమ్మరని పేర్ని నాని వివరించారు. 

మరిన్ని వార్తలు