సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు విసురుతుంటే మాకేం​ సంబంధం?: పేర్ని నాని

9 Jun, 2023 14:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు అండగా నిలిచారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడనే నమ్మ​కం, ఆశా ప్రజల్లో ఉంది అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 

ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ రద్దు
వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే 99 శాతం హమీల్ని మా ప్రభుత్వం అమలు చేసింది. 2004 తర్వాత ఉద్యోగం పొందిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్‌ స్కీమ్‌ను తీసేసి కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను ఇప్పటిదాకా అమలు చేస్తూ వస్తున్న పరిస్థితులున్నాయి. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా నియామకమై, దాదాపు ముప్ఫై, ముప్పై ఐదేళ్లకు పైగా సేవలందించి పదవీ విరమణ పొందితే, వారికి కేవలం నాలుగైదు వందలు మాత్రమే పెన్షన్‌ వచ్చే పరిస్థితి ఇప్పటివరకూ ఉంది.

దీంతోపాటు సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన రిటైర్డ్‌ ఉద్యోగి హఠాత్తుగా చనిపోతే.. కనీసం అతని మట్టిఖర్చులు కూడా భరాయించులేని దిక్కులేని దయనీయమైన దుస్థితిని మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు పాదయాత్రలో ఆలకించారు. మచిలీపట్నంలో పాదయాత్రప్పుడు ఇదే విషయంపై కొంతమంది కొత్తతరం ఉద్యోగులు కలిసినప్పుడు వారితో కులంకషంగా చర్చించాక ఆయనొక హామీనిచ్చారు.

మనందరి ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం జగన్‌ గారు తన మాటను ఇప్పుడు నిలబెట్టుకుని, సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను అమల్లోకి తేవాలని నిర్ణయించి, దాన్ని ప్రకటించారు. ఇదొక బృహత్తర నిర్ణయంతో మేం ఎన్నికల మ్యానిఫెస్టోను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామనేది అర్థమౌతోంది. ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనంటూ మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. 

ఉద్యోగుల్ని మోసం చేయడంలో నేర్పరి చంద్రబాబు
14 ఏళ్లపాటు సీఎంగా  అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై ఏవేవో కోతలు కోశాడు. ఉద్యోగులందరికీ భ్రమలు కల్పించి ఏమైనా చేశాడా..? అంటే, చేతులెత్తేశాడు. అధికారంలో ఉన్నప్పుడు బాబుకు ప్రజలు గానీ, వారికి ఇచ్చిన హామీలు గానీ ఏమీ గుర్తుకురావు. అదే అధికారం పోగానే కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నింటినీ చెప్పగల నేర్పరితనం ఉన్న నాయకుడు ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. 

ఉద్యోగులు అడక్కుండానే 12వ పీఆర్సీ నియామకం
ఏపీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఒకటో పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) నుంచి 11 పీఆర్సీ వరకు ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు చేయకుండా ఏ ప్రభుత్వమైన పీఆర్సీ నియామకం చేసి అమలు చేశాయా..? అని ఉద్యోగులంతా ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోవాలని  అభ్యర్థిస్తున్నాను.  గతంలో ఏ ప్రభుత్వమైనా మీరు అడక్కుండానే పీఆర్సీ కమిటీని నియామకం చేయడం.. అమలు చేసిన పరిస్థితి ఉంటే సమాధానం చెప్పమని అడుగుతున్నాను. కానీ, ఈరోజున ఉద్యోగులెవరూ రోడ్డెక్కకుండానే, ఎక్కడా దానిగురించి నిరసనలు తెలపకుండానే 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి కమిటీ నియామకం చేయాలని మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాంట్రాక్టు ఉద్యోగుల్ని బాబు ఎందుకు క్రమబద్ధీకరించలేదు
మరి, గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఒక పండిపోయిన రాజకీయ ముసలోడు చంద్రబాబు పాలనను అందరూ చూశారు కదా.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బాబు వాగ్దానం చేశాడు కదా..? ఆ హామీ ఏమైంది..? అని అడుగుతున్నాను. మంత్రివర్గ కమిటీల పేరుతో కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా.. ఆ హామీ ఏమైందని నిలదీస్తున్నాను. దీనిపై బాబు సమాధానం చెప్పాలి. ఆ మంత్రివర్గ కమిటీ ప్రజల చేతుల్లో చచ్చిపోయింది మినహా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క తీర్మాన్నైనా అమలు చేసిందా..? అని గుర్తుచేస్తున్నాను

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది
 ఇదికదా, అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ,  ప్రజల ప్రభుత్వమని.. అడుగుతున్నాను.  మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడో అందరూ గుర్తించాల్సిన సందర్భం ఇదేకదా అని నేను గర్వంగా చెబుతున్నాను.ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలత, సానుభూతిని ప్రదర్శించడమంటే ఇదేకదా.. ? . జగన్‌గారి ప్రభుత్వానికి చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ఉద్యోగస్తులంతా పోల్చి చూసుకోవాలి.

10వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాం
 ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఇలా కాదు.. అలా చేద్దామని ఉద్యోగులతో సంప్రదింపులు చేసిన పరిస్థితులు తప్పితే మేం ఎక్కడా వారిని నిర్లక్ష్యం చేసిన దాఖలాల్లేవు. నాడు మా నాయకుడు జగన్‌ గారు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన మేరకు,  

ఈరోజు మా ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూసి అలసిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కలను మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు నెరవేర్చారని వారంతా పాలాభిషేకాలు చేస్తూ కీర్తిస్తున్నారు. పాడికుండలాంటి ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాక,  అవిభాజ్య ఏపీలో 2014కు ముందు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్దీకరిస్తామని జగన్‌ గారు ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఈరోజు సుమారు 10వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుని.. మాటతప్పం.. మడమతిప్పమని.. జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంతే.. అని మరోమారు నిరూపించుకున్నారు.

ఇంకా విమర్శలు చేసే వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
 ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలమా..? వ్యతిరేకమా..? అని ఇప్పటిదాకా జగన్‌గారు ఉద్యోగులకు వ్యతిరేకమని పెద్దపెద్దగా గొంతులు చించుకుని అరిచిన మేధావుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే ఇప్పటిదాకా జగన్‌ గారిపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లే విమర్శలు చేస్తూ దూషణ చేసిన కొన్ని ఉద్యోగ సంఘాల్ని, ఆయా సంఘాల నాయకుల్ని వారి గుండెలపై చేయ్యేసుకుని అంతరాత్మను ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూలంగా, సానుభూతితో పనిచేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరైనా ఉన్నారా..? ఒక్క  మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు, ఆ తర్వాత జగన్ గారు తప్పితే.. అనేది ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నాడు తండ్రీ.. నేడు వారి కొడుకు శ్రీ వైఎస్‌ జగన్‌గారు ఒక్కరే ఉద్యోగుల పట్ల దేవుడుగా నిలిచారని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 

ఎవడో చేసింది కాపీ కొట్టడం.. రాజకీయాలు, రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మేము చేయాలనే తప్పుడు ఆలోచనతో కాకుండా, ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథం, బాధ్యత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారికి ఉంది. ఆ తర్వాత, ఆయన కొడుకు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి మాత్రమే ఉందని నేను ఈరోజు గర్వంగా చెబుతున్నాను. ఇది చరిత్ర చెబుతున్న నిజమని గుర్తించాలి. 

ప్రభుత్వ సర్వీసులోకి వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులు
 ప్రభుత్వ వైద్యవిధాన పరిషత్‌లో వైద్యులు కాకుండా నర్సులు, ఇతరత్రా ఉద్యోగులకు నెలనెలా జీతాలు రావాలంటే, పెద్ద ప్రహసనమే నడవాల్సి ఉండేది. మండలాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లును జిల్లా కేంద్రాల్లో సంతకాలు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది. అలాంటిది, ఇప్పుడు అలాంటి జాప్యమేమీ లేకుండా దాదాపు 13వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేసి, వారికి నెలనెలా జీతం అందించే ప్రక్రియకు కూడా ఈరోజు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలాంటి మేలుకోరే ప్రభుత్వాన్ని ఉద్యోగులు గతంలో ఎన్నడూ చూసి ఉండరు. కనుక, మేం వైఎస్‌ఆర్‌సీపీ తరఫున, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

సెల్ఫీ దిగలేదని కోడిగుడ్లు వేస్తే ప్రభుత్వానికేంటి సంబంధం..?
లోకేశ్‌ ఏ పార్టీకి అధ్యక్షుడూ కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు. కనీసం సర్పంచిగా కూడా గెలవనటువంటి ఆయనకు భద్రత కరువైందని టీడీపీ నేతలు  చెప్పడంలో అర్థమేమైనా ఉందా..? పోనీ, పవన్‌కళ్యాణ్, కేఏ పాల్‌ మాదిరిగా ఏదొక చిన్నపార్టీకి అధ్యక్షుడు కూడా కాదు కదా. ఆయనకు ఉన్న అర్హతల్లా చంద్రబాబు కొడుకు కావడమే కదా..?. యాత్రల పేరుతో నలుగుర్ని పోగేసుకొచ్చి,  పదిమంది నినాదాలు చేయగానే ఒళ్ళు ఉప్పొంగి, పోలీసుల్ని ఉద్దేశించి పచ్చిబూతులు మాట్లాడటం.. ఏరా అని.. ఒరేయ్‌ అనడం అందరూ చూస్తూనే ఉన్నారు కదా..? ఇలాంటి వ్యక్తికి భద్రత కరువైందని ఆపార్టీ నాయకులు గవర్నర్‌ను కలవడం విచిత్రంగా ఉంది. గవర్నర్ గారికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేకుంటే, వీళ్ళ మాటలు వింటే, వీళ్ళనే చీవాట్లు పెట్టి పంపేవారు. 

ఖాకీ యూనిఫాం ధరించిన పోలీసులు చాలా మంచోళ్లు కాబట్టి.. లోకేశ్, అచ్చెన్నాయుడు ఎన్ని బూతులు తిడుతున్నా.. ఎన్ని అవమానాలపాల్జేస్తున్నా వారినేమీ అనకుండా బందోబస్తు చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకైన లోకేశ్‌కు ప్రభుత్వం తన పరిధికి మించి పోలీసు భద్రత కల్పిస్తూనే ఉంది. అవసరమనుకుంటే, ఆయన పాదయాత్రలో ఎంతమంది పోలీసులు బందోబస్తు డ్యూటీ చేస్తున్నారనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికీ రానటువంటి కష్టాలు చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు వచ్చాయి.

వాళ్ల పార్టీ కార్యకర్తలే సెల్ఫీ దిగలేదని లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టారంట. ఇదేం విడ్డూరం. సెల్ఫీఫోటో ఇవ్వకపోతే రాళ్లు, కోడిగుడ్లుతో నాయకుల్ని కొట్టే కార్యకర్తలు వాళ్ల పార్టీలో ఉన్నారా..? మీపార్టీ వాళ్లు మిమ్మల్ని కోడిగుడ్లు విసిరి దాడి చేస్తే.. మేం ప్రభుత్వం తరఫున భద్రత పెంచడమేంటి..? మాకేం అవసరం ..? అలాంటప్పుడు ముందుగా బాబు టీడీపీ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పుకోవాలి కదా..? కార్యకర్తలకు క్రమశిక్షణ ఇచ్చుకోలేని దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని అందరూ అనుకోవాలి కదా.. !

ఇది కూడా చదవండి: అవినాష్‌రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్‌!

మరిన్ని వార్తలు