అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు

26 May, 2022 04:49 IST|Sakshi

రౌడీ షీటర్ల ఉచ్చులో పడొద్దు

మంత్రి పినిపే విశ్వరూప్‌

అమలాపురం రూరల్‌: అమలాపురంలో అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పినిపే విశ్వరూప్‌ స్పష్టం చేశారు. బుధవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోనసీమ సాధన సమితి పేరుతో ఎవరైతే ర్యాలీకి పిలుపు ఇచ్చారో వారే దీనికి బాధ్యత వహించాలన్నారు. కోనసీమ ప్రజలు, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచివారని, శాంతి కాముకులని అన్నారు.

శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో కొంతమంది రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఒక ఉద్యమాన్ని డైవర్ట్‌ చేసి.. తన ఇంటిపైన, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైన దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని చెప్పారు. పొన్నాడ సతీష్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించారన్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు.

ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, కోనసీమ చరిత్రలో 50 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదన్నారు. కోనసీమ సాధన సమితి వారికి గానీ, విద్యార్థులకు గానీ తమ ఇళ్లపై దాడి చేయడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. రౌడీషీటర్లు పెట్రోల్‌తో వచ్చారని, వాళ్లు ఇంటిని, తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపై దాడి చేసి తగులబెట్టారన్నారు.

కానీ.. సతీష్‌ ఇంటికి కేవలం పది మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ఉన్నారని, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వాళ్ల కాల్‌డేటా బయటకు వస్తుందని, ఐక్యవేదిక ముసుగులో తమ పార్టీ నాయకులను ఎవరు సంప్రదించారో వాళ్ల వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలెవరూ రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు