చంద్రబాబు శవ రాజకీయాలు

5 Jun, 2022 08:12 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 

మాచర్ల: రాష్ట్రంలో అధోగతి పాలైన టీడీపీని కాపాడుకునేందుకే ప్రతి చిన్న ఘటనను భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..  పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీని ఓడించారన్న కక్షతో చంద్రబాబు హత్యలు, అల్లర్లు సృష్టించే వారిని చేరదీసి మద్దతు పలుకుతున్నారన్నారు.

గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోనసీమ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో చంద్రబాబు మత, ప్రాంతీయ, కులాల మధ్య వివాదాలు సృష్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. గుండ్లపాడు, జంగమహేశ్వరపాడు ఘటనలతో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అనేక సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించినప్పటి నుంచే ఆయా గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అలజడులు సృష్టించి, గొడవలు చేసి, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేసిన వారిని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న ఘటనను భూతద్దంలో చంద్రబాబు చూపుతున్నారన్నారు. 

టీడీపీ హయాంలోనే ఫ్యాక్షనిజం
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో అనేక గ్రామాల్లో ఫ్యాక్షనిజం పెరిగిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయని, ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఆగిపోయాయని గుర్తు చేశారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరిగి అరాచకాలు పెరిగాయన్నారు. అందులో భాగంగానే టీడీపీ నాయకుడు కంచర్ల జాలయ్య వైఎస్సార్‌ సీపీకి చెందిన గుడిపాటి వెంకట్రామయ్యను హత్య చేశారన్నారు. 

అయినా ఫ్యాక్షన్‌ రాజకీయాలు వద్దని నచ్చజెప్పి అదే కేసులో మొదటి ముద్దాయి అయిన కంచర్ల జాలయ్యను, పార్టీకి చెందిన వారిని పిలిచి రాజీ చేశానన్నారు. అందుకు భిన్నంగా మాజీ సీఎం చంద్రబాబు, లోకేశ్‌ కలిసి మాచర్ల నియోజకవర్గంలో ఏడుగురి హత్య కేసులలో నిందితుడైన జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారని, అప్పటినుంచే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. తానెప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేయలేదని,  కక్షలతో రగులుతున్న వారి మధ్య రాజీ కుదిర్చి.. ప్రతి గ్రామంలో అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఏదో ఒక ఘటనను ఆధారం చేసుకొని పల్నాడు జిల్లాను అభివృద్ధికి దూరం చేసి ప్రజల మధ్య అపోహలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

రక్తపాతం సృష్టించి ఇరువర్గాలను రెచ్చగొడుతున్నారని, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనను పెద్దది చేసి చంద్రబాబు ఓట్లు సంపాదించాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుండ్లపాడు గ్రామంలో కూడా పాడె మోసి ఓట్ల కోసం చంద్రబాబు దిగజారారని పేర్కొన్నారు. ఇదంతా ప్రజలు గమనించాలని, అన్ని వర్గాలు సమన్వయంతో ఉండాలని, ఘర్షణలకు దూరంగా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. 
 

మరిన్ని వార్తలు