కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి.. పిప్పిలి ఉప ఎన్నిక వాయిదా!

15 Apr, 2021 08:56 IST|Sakshi

భువనేశ్వర్‌: పిప్పిలి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అజిత్‌ మంగరాజ్‌ (52) బుధవారం మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాదకర వాతావరణం అలుముకుంది. నామినేషన్‌ దాఖలు తర్వాత విస్తృత ప్రచారం చేస్తూ ఈ నెల 7 వ తేదీన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తక్షణమే ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఈ నెల 10వ తేదీన కోవిడ్‌ పాజిటివ్‌ నమోదు కావడంతో చికిత్స పొందుతూ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.  ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తోటి రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

అదే విధంగా, అజిత్‌ మంగరాజ్‌ అకాల మరణం పట్ల గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌ సంతాప సందేశం జారీ చేశారు. అజిత్‌ కుటుంబీకులకు  సానుభూతి ప్రకటించారు. ఉత్సాహవంతుడైన నాయకుడ్ని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుందని అజిత్‌ మంగరాజ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ హరిచందన్‌  సంతాపం ప్రకటించారు.   ఉప ఎన్నిక పోటీలో ఉన్న అజిత్‌ మంగరాజ్‌ అకాల మరణం అత్యంత విచారకరమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సానుభూతి ప్రకటించారు. అజిత్‌ మంగరాజ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

బీజేపీ సంతాపం
అజిత్‌ మంగరాజ్‌ మరణంపట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. పిప్పిలి నియోజక వర్గ కేంద్రంలోని పార్టీ శిబిరంలో బుధవారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. పట్టుదల కలిగిన నాయకుడిని రాష్ట్ర రాజకీయ రంగం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌ మహంతి, ప్రతిపక్ష నాయకుడు ప్రదీప్త నాయక్‌ శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ ఏర్పాటు చేసిన సంతాప సభలో బీజేపీ రాష్ట్ర శాఖ ప్రముఖులు కనక వర్ధన సింగ్‌దేవ్, మన్మోహన్‌ సామల్, పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మానస మహంతి, ఉపాధ్యక్షుడు భృగు బక్షిపాత్రో, ప్రభాత్‌ ఫరిడా, ఎమ్మెల్యే కుసుమ్‌ టెట్టె తదితరులు పాల్గొన్నారు.  

పార్టీ సిపాయిని కోల్పోయింది: ఏఐసీసీ కార్యదర్శి
రాష్ట్ర కాంగ్రెస్‌ అంకిత భావంతో నిరంతరం కృషి చేసిన సిపాయిని కోల్పోయిందని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి జి. రుద్ర రాజు విచారం వ్యక్తం చేశారు. లోగడ 2019వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిప్పిలి నియోజక వర్గం నుంచి ఆయన పోటీచేశారు. గత ఎన్నికల్లో  ఓటమిని లెక్క చేయకుండా ఈసారి ఉప ఎన్నికలో పోటీకి మరోసారి పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్‌ కేటాయించడం అజిత్‌ మంగరాజ్‌ పోరాట పటిమకు తార్కాణమన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పిప్పిలి నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కార్యాచరణ ఖరారవుతుందని తెలిపారు. 

ఉప ఎన్నిక వాయిదా!
భువనేశ్వర్‌: పూరీ జిల్లా పిప్పిలి అసెంబ్లీ నియోజక వర్గం ఉపఎన్నిక వాయిదా పడనుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థి అజిత్‌ మంగరాజ్‌ బుధ వారం కన్ను మూశారు. పోలింగుకు ముందుగా ఆయన మృతి చెందడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలున్నాయి. గతంలో పటకురా అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా వేద్‌ ప్రకాష్‌ అగర్వాల్‌ నామినేషన్‌ దాఖలు చేసి పోలింగుకు ముందు మరణించడంతో ఈ నియోజక వర్గంలో ఎన్నిక వాయిదా వేశారు. పిప్పిలి నియోజక వర్గంలో పోలింగ్‌ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1952 సెక్షన్‌ 1(సి) ప్రకారం పోలింగుకు ముందు పోటీకి ఖరారైన అభ్యర్థి మరణిస్తే సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ప్రకటన మేరకు పోలింగ్‌ వాయిదా వేస్తారు. రిటర్నింగ్‌ అధికారి సమాచారం మేరకు ఎన్నికల కమిషన్‌ పోలింగు వాయిదా ప్రకటించి తదుపరి పోలింగ్‌ తేదీని ఖరారు చేస్తుంది.  

వారం రోజుల్లో కొత్త అభ్యర్థి
మృతిచెందిన అభ్యర్థి స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించేందుకు రిటర్నింగ్‌ అధికారి నివేదిక జారీ అయ్యాక ఎన్నికల కమిషన్‌ వారం రోజులు గడువు మంజూరు చేస్తుంది. ఈ మేరకు సంబంధిత   పార్టీకి నోటీసు జారీ అవుతుంది. ఇతర పార్టీ ల స్థితిగతులు యథాతథంగా కొనసాగుతాయి. ఈ లెక్కన  పిప్పిలి నియోజక వర్గం ఉపఎన్నిక వాయిదా పడి మే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య పోలింగ్‌ నిర్వహణ జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు, పరిశీలకులు భావిస్తున్నారు.  

చదవండి: ఉప ఎన్నిక: నాన్న కల నిజం చేస్తా!

మరిన్ని వార్తలు