పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు.. అంతా ఉత్త ముచ్చటే!

28 Apr, 2022 08:00 IST|Sakshi

ఢిల్లీ: జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. కాంగ్రెస్‌ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ.. కథనాలు జాతీయ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం స్పందించారు. 

ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ నాయకత్వం గురించి ప్రతిపాదనేం చేయలేదని చిదంబరం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. చాలా నెలలు కష్టపడి ఆయన(పీకేను ఉద్దేశిస్తూ) డాటా సేకరించారు. దానిపై ఆయన విశ్లేషణ.. ఆకట్టుకునేలా ఉంది. ఆ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా ఆచరించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కూడా’ ఆయన చిదంబరం స్పష్టం చేశారు. అయితే..

కాంగ్రెస్‌ నాయకత్వ సమస్యపై పీకే తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించలేదు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రియాంక పేరు ప్రతిపాదించిన విషయం నేను వినలేదు. అది నిజం కాదు కూడా.  ఓ వర్గం మీడియా దానిని తెర పైకి తీసుకొచ్చింది. నాయకత్వ సమస్య పార్టీ అంతర్గత విషయం. ఏఐసీసీనే దానిని పరిష్కరిస్తుంది. ఆగష్టు చివరినాటికి ఎన్నికలతో ఆ సమస్య పరిష్కారం కావొచ్చు అని చెప్పారు. 

ఇక పార్టీ చేసిన ప్రతిపాదనను నిరాకరించిన విషయంపై పీకేను మళ్లీ వివరణ ఏమీ కోరలేదని, బహుశా ఆయన రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాడేమోనని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఐ-పీఏసీ(Indian Political Action Committee)(ప్రశాంత్‌ కిషోర్‌ స్థాపించిన కన్సల్టెన్సీ) చేసుకున్న ఒప్పందం వల్లే పీకే, కాంగ్రెస్‌లో చేరలేదన్న వాదనలో అర్థం లేదని చిదంబరం పేర్కొన్నారు.

చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే- ప్రశాంత్‌ కిషోర్‌

మరిన్ని వార్తలు