మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్‌

27 Nov, 2021 17:24 IST|Sakshi

మొహాలిలో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కిన టీచర్లు

కిందకు రావాలని కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి

అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ

మొహాలి: ‘నన్ను మీ సోదరుడిగా భావిస్తే, దయచేసి కిందకు దిగండి. మేము త్వరలో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము’ అంటూ పంజాబ్‌లోని కాంట్రాక్టు టీచర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీయిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మొహాలీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ వాహనంపై ఎక్కి పైకి చూస్తూ వారితో మైక్‌లో సంభాషించారు. కిందకు దిగి రావాలని వారిని కోరారు. 

‘మీరు ఎంతకాలం నుంచి నిరసనలు చేస్తున్నారు?’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించగా.. దానికి వారు ‘సార్, 45 రోజులు’ అని బదులిచ్చారు. కాంట్రాక్టు టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ‘విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలోని ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఇంగ్లండ్, స్వీడన్‌ దేశాలకు పంపుతున్నాము. పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కారు వారిని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులకు పంపుతోంద’ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యావ్యవస్థను పూర్తిగా సంస్కరించామని, ఈ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. 

పర్మినెంట్ ఉద్యోగాలు, మెరుగైన జీతాల కోసం చాలా కాలంగా కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పంజాబ్ ఎడ్యుకేషన్ బోర్డ్ వెలుపల టీచర్లు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కొంతమంది ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు)

‘కెప్టెన్ అమరీందర్ సింగ్, బాదల్ సహా పలువురు ముఖ్యమంత్రులు ఉపాధ్యాయులకు గతంలో ఇవే హామీలు ఇచ్చారని విన్నాను. ఆ ట్రెండ్‌ని అనుసరించడానికి నేను ఇక్కడకు రాలేదు. ఢిల్లీలోని విద్యావ్యవస్థను సంస్కరించిన తీరు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ఇదంతా అది మా టీచర్ల గొప్పతనమే. నేను చేయాల్సిందల్లా వారి సమస్యలను పరిష్కరించడమే. పంజాబ్‌లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అని కేజ్రీవాల్‌ వాగ్దానం చేశారు. (చదవండి: మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’)

మరిన్ని వార్తలు