విపక్షాలపై మోదీ ఫైర్‌

29 Sep, 2020 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారంతా రైతులను అవమానిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాపై మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌కు నిప్పంటించిన నేపథ్యంలో విపక్షాల తీరును ప్రధాని ఎండగట్టారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో రైతులు, కార్మికులకు సంబంధించి పలు సంస్కరణలను చేపట్టామని..ఈ సంస్కరణలు రైతులు, కార్మికులు, యువత సహా మహిళలకు మేలు చేకూరుస్తున్నాయని చెప్పారు. రైతులు పూజలు చేసుకుని గౌరవించే యంత్రాలు, పరికరాలకు నిప్పుపెట్టడం ద్వారా విపక్షాలు రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే వారు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదారిపట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

వ్యవసాయ బిల్లులతో దేశంలో కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ లభించిందని మోదీ పేర్కొన్నారు. రైతులకు స్వేచ్ఛ లభించడాన్ని కొందరు సహించలేకపోతున్నారని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఉత్తరాఖండ్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రధాని అన్నారు. నల్ల ధనం లభించే వనరు మూసుకుపోయిందనే వారి బాధని ఆరోపించారు. కాగా వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాలు ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ బిల్లులతో మద్దతు ధర కనుమరుగవుతుందని, రైతులు కార్పొరేట్ల కనుసన్నల్లో నడుచుకోవాల్సి వస్తుందని విపక్షాలు ఆరోపిస్తుండగా, వ్యవసాయ బిల్లులతో దళారీ వ్యవస్థ అంతమై రైతులకు మేలు చేకూరుతుందని బీజేపీ పేర్కొంటోంది. చదవండి : అన్నదాతలే వెన్నెముక

మరిన్ని వార్తలు