బెంగాల్‌లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ

4 May, 2021 16:41 IST|Sakshi

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది.  దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం  చేసిన మోదీ  గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు మంగళవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు.  గవర్నర్ ధన్‌కర్ మంగళవారం  ట్విటర్‌ ద్వారా వివరాలందించారు.

ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దోపిడీలు, హత్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రికి తాను తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు. ఈ హింసలో కనీసం 12 మంది మరణించారని ఇది గత నెల రోజుల ఎన్నికలలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చంటూ దీనిపై  నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని ఆయన తెలిపారు.

హుటిహుటిన కోల్క‌తాకు నడ్డా
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని నడ్డా వ్యాఖ్యానించారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్ర హింస జరిగిందనీ, తాజా ఘటనలు తమను దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయన్నారు. ఇంతస్థాయిలో అసహనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడలేదనిన్నారు. దక్షిణ 24 పరగణాల (ఎఎన్‌ఐ) ప్రతాప్‌నగర్‌లో బాధిత పార్టీ కార్యకర్తలను నడ్డా  పరామర్శించారు.

ఖండించిన టీఎంసీ
ఈ ఆరోపణలు టీఎంసీ పూర్తిగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి గెలిచిన ముఖ్యమంత్రి  తమ నేత మమతా బెనర్జీ అని, బెంగాల్ శాంతి ప్రియమైన ప్రదేశమని పేర్కొంది. అసలు బీజేపీనే  తీవ్ర హింసకు పాల్పడిందిన, సీఏపీఎఫ్‌ ప్రయోగించిందని  మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆదివారం  బెంగాల్‌లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ప్రదాన ఆరోపణ. టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని, 4వేలకు పైగా ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. ఈ హింసాకాండకు బాధ్యత అధికార పార్టీదేనని పేర్కొంది. మమతా  సర్కార్‌ ఫాసిస్టు ప్రభుత్వమని, టీఎంసీని నాజీలంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.  మరోవైపు ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు