కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించండి: ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

5 Mar, 2022 13:42 IST|Sakshi

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. మీర్జాపూర్‌లో ఎన్నికల ప్రచార సభ అనంతరం వారణాసికి చేరుకున్నారు. కాషాయం రంగు టోపీ, కండువా ధరించి ఓపెన్‌ టాప్‌ వాహనంలో నిల్చొని ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. నగరంలో మూడు కిలోమీటర్ల మేర రోడ్‌షో కొనసాగింది. మోదీ కాశీ విశ్వనాథ ఆలయంలో షోడశోపార పూజ చేశారు. 
సమస్య ఎలాంటిదైనా ధీటుగా ఎదుర్కొంటాం 
ప్రస్తుతం యావత్‌ ప్రపంచం సంక్షోభం ముంగిట ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, సమస్య ఎంతపెద్దదైనా భారత్‌ అంతకంటే ధీటుగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. మీర్జాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘కోవిడ్‌ మహమ్మారి, అశాంతి, అస్థిర పరిస్థితులను ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. సంక్షోభం ఎంత పెద్దదయినా అంతకంటే బలం, పట్టుదలతో దేశం ఎదుర్కొంటుంది’ అని చెప్పారు.

తమ ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం కింద వేలాది మందిని స్వదేశానికి తీసుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించి బీజేపీ ప్రభుత్వానికే ఓటేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించి, అధికారాన్ని చేజిక్కించుకుని, ఆ తర్వాత దోచుకోవడమే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యమంటూ మోదీ దుయ్యబట్టారు.  

మరిన్ని వార్తలు