ఆ ప్రాంతంలో పర్యటించిన మొదటి ప్రధాని మోదీనే

3 Apr, 2021 18:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీనేనని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఈరోడ్‌లో జరిగిన రోడ్ షోలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాఫ్నాలో బాంబ్‌ దాడి నిర్వాసితులకు కేంద్రం సాయం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా జాఫ్నాలో పర్యటించలేదన్నారు.

అక్కడ పర్యటించడమే కాకుండా బాంబు దాడి నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేశారని నడ్డా గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మైనారిటీలైన తమిళులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశపు తొలి మహిళా రక్షణ మంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ - ఇద్దరూ తమిళనాడుకు చెందినవారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమిళనాడులో భూకబ్జాలను,గూండాయిజం, విద్యుత్ కోతలు ఆగాలంటే అన్నాడీఎంకే-బీజేపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని నడ్డా ఓటర్లను అభ్యర్థించారు. కాగా, ఏప్రిల్ 6న తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగనుంది. ( చదవండి: TN Assembly Polls: కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం )

మరిన్ని వార్తలు