ఇక నుంచి మీ కలే నా కల

10 May, 2023 04:24 IST|Sakshi

ఉమ్మడి లక్ష్యంగా ముందుకెళ్తే ప్రపంచంలో ఆపేవారే లేరు

కన్నడ ప్రజలకు రాసిన లేఖలో ప్రధాని మోదీ

బెంగళూరు: తమ ఓటు ద్వారా భవిష్యత్తు ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు సమాయత్తమవుతున్న కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న తన పట్ల ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు అనుపమానమైనవని ఆయన అభివర్ణించారు. లేఖలోని విషయాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్‌చేస్తూ ట్వీట్లు చేశారు.

‘ కర్ణాటకలోని సోదరసోదరీమణులకు నమస్కారం. రాష్ట్రంలో ప్రచారం వేళ నాపై మీరు చూపిన ఆదరాభిమానాలు సాటిలేనివి. అన్ని రంగాల్లో కర్ణాటకను అగ్రస్థానంలో నిలపాలన్న నా సంకల్పానికి మీ ప్రేమానురాగాలు మరింత శక్తిని అందించాయి. దేశంలో కర్ణాటకను నంబర్‌ వన్‌ రాష్ట్రంగా మార్చే యజ్ఞంలో మీ ఆశీస్సులు నాకు కావాలి. రాష్ట్ర ఉజ్వల భవిత గురించే నా విజ్ఞప్తి. మీ కుటుంబాలు, ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించే నా విన్నపం. కన్నడనాట ఈసారి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రావాలి అనే నినాదాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

నేడు 90 వేల కోట్లు.. నాడు 30 వేల కోట్లే..
‘‘నేడు మనం అమృతకాలంలో పయనిస్తున్నాం. ‘ఆజాదీ కా అమృత్‌ కాల్‌’లో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమాన్ని కర్ణాటక ముందుండి నడిపించి ఈ కలకు నిజం చేయాలి. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇకపై మూడో స్థానమే మన లక్ష్యం. ఒక ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా కర్ణాటక ఎదిగినప్పుడే ఇది సాధ్యం.

ఇక్కడ బీజేపీ హయంలో ఏటా రూ.99వేల కోట్ల విదేశీ పెట్టుబడులొచ్చాయి. గత సర్కార్‌ల కాలంలో ఇవి కేవలం రూ.30వేల కోట్లే. అత్యంత అనువైన జీవనం, వ్యాపార అనువైన రాష్ట్రంగా కర్ణాటక నంబర్‌వన్‌ స్థానంలో నిలిచేలా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. జగత్‌జ్యోతి బసవేశ్వర, కెంపెగౌడ, శ్రీ కనకదాస వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడుస్తూ అభినవ కర్ణాటకను నిర్మించే మహాక్రతువులో బీజేపీ నిమగ్నమైంది.

ఇకపై మీ కల నా కల. మీ సంకల్పాన్ని నాదిగా భావిస్తున్నా. ఆలోచనలు కలిసి నిర్దేశించుకున్న మన ఉమ్మడి లక్ష్య సాధనను ప్రపంచంలో మరెవరూ ఆపలేరు’’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు