అధికారమే లక్ష్యంగా దూసుకెళ్లండి.. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో భేటీలో ప్రధాని మోదీ

7 Jun, 2022 20:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని, ప్రజా ప్రతినిధులుగా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉండాలని ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బూత్‌ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టే ఏ కార్యక్రమాలకైనా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, దీనిపై అందరూ దృష్టి పెట్టాలని చెప్పారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఢిల్లీలోని 7–లోక్‌ కల్యాణ్‌ మార్‌్గలో జరిగిన భేటీలో బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు సహా 82 మంది నేతలు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా గంటన్నరపాటు ఒక్కో కార్పొరేటర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడిన మోదీ.. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజాజీవితంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచు కొని కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు. కార్పొరేటర్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని, అప్పుడే పార్టీ బలోపేతం సాధ్యమని చెప్పారు. ముఖ్యంగా గత ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేపట్టాలి్సన అభివృద్ధి కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు.

అనంతరం కార్పొరేటర్లు సహా సమావేశానికి హాజరైన నాయకులందరితో కలిసి ప్రధాని గ్రూప్‌ ఫోటో దిగారు. ఈ భేటీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్‌ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పరిస్థితులు అనుకూలం.. అధికారానికి అవకాశం: బీఎస్‌ సంతోష్‌
మోదీతో భేటీకి ముందు కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు సంజయ్‌ నేతృత్వంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌లతో భేటీ అయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసే అంశంపై సంతోష్‌ పలు సూచనలు చేశారు. దక్షిణ భారత్‌లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, కుటుంబ వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ అవినీతి, కాంగ్రెస్‌ వైఫల్యాలు వంటి అంశాలు బీజేపీ అనుకూలంగా మారాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకత్వానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతోనే జైపూర్‌లో జరగాల్సిన జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌కు మార్చామని కార్పొరేటర్లతో ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ సైతం పార్టీ అధికారంలోకి వచ్చే విషయమై కార్పొరేటర్లకు పలు సూచనలు చేశారు.

తెలంగాణలో దుష్టపాలన ముగింపునకు కృషి
తెలంగాణలో సుపరిపాలన దిశగా, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అనంతరం మోదీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై కార్పొరేటర్లతో విస్తృత చర్చలు జరిపామని తెలిపారు.  

మరిన్ని వార్తలు