'ఓటింగ్‌కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'

12 Aug, 2023 11:57 IST|Sakshi

కోల్‌కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్‌లో నిర్వహించిన పశ్చిమ  బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. 

అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే  వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. 

బెంగాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ  అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్‌లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 

బెంగాల్‌లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్‌, ఒడిశా, జార్ఖండ్‌లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్‌లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్‌గా పాల్గొననున్నారు. 

ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..

మరిన్ని వార్తలు