బెంగాల్‌లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ 

10 Apr, 2021 13:35 IST|Sakshi

బెంగాల్  టీఎంసీ జాగీరు కాదు : పీఎం మోదీ 

దీదీని, ఆమె గుండాలను ప్రజలు తిప్పికొట్టనున్నారు 

బెంగాల్‌లో కొత్త ఏడాదిలో బీజేపీ సర్కార్‌

కోలకతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు నాలుగోదశ పోలింగ్‌ హింసకు దారి తీసింది.  బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కూచ్ బెహార్, సీతాల్‌కుచిలో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం కూచ్ బెహార్‌లో రెండు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించినట్లు సమాచారం. మరో నలుగురు గాయపడ్డారు.  ఈ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మమతా  బెనర్జీ  సర్కార్‌పై  తీవ్ర విమర్శలు చేశారు. ఓటరును కాల్చి చంపి ఘటన చాలా దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు.  పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ, టీఎంసీ ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్‌లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి దీదీ ఆమె గూండాలకు వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు.

సిలిగురిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ  ప్రస్తుత ఎన్నికల్లో  మమతా బెనర్జీని, ఆమె గుండా ముఠాను తిప్పి కొడతారంటూ మండిపడ్డారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, పోల్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం టీఎంసీని  కాపాడలేవంటూ దీదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూచ్ బెహార్‌ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. బెంగాల్‌లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ కొలువు దీరనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. మంచి చెడుపై విజయం సాధించబోతోందనీ, గత మూడు దశల పోలింగ్‌లో బీజేపీకి ప్రజలు భారీ మద్దతును అందించారని మోదీ పేర్కొన్నారు.
(పీకే క్లబ్‌హౌస్ చాట్ కలకలం: దీదీకి ఓటమి తప్పదా?)

నాలుగో విడత పోలింగ్ సందర్భంగా  సీతాల్‌కుచిలో ఈ ఉదయం 18ఏళ్ల బీజేపీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కూచ్ బెహార్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ కాల్పుల ఘటనపై ఈసీ అధికారులను వివరణ కోరింది. హుగ్లీలో   పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ  మహిళా ఎంపీ లాకెట్ చటర్జీ వాహనంపై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆమెను అక్కడినుంచి తప్పించారు. ఈ సందర్భంగా పలు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా మొత్తం 44 నియోజక వర్గాలకు నాలుగో దశపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు  చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు