నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు.. నన్ను క్షమించండి.. మోదీ వీడియో వైరల్‌

1 Oct, 2022 11:05 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్ సిరోహిలో శుక్రవారం పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఆయన అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అబు రోడ్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ఆలస్యంగా వెళ్లారు. సమయం రాత్రి 10గంటలు దాటిపోయింది. రాజస్థాన్‌లో  10 దాటిన తర్వాత మైక్‌లు, లౌడ్‌ స్పీకర్లపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ఆయన మైక్‌లో మాట్లాడలేదు.

నిబంధనలు అతిక్రమించి మైక్‌లో ప్రసంగించడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మోదీ అన్నారు. దయచేసి తనను క్షమించాలని అక్కడికి భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యర్తలను, అభిమానులను కోరారు. తాను మరోసారి కచ్చితంగా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఇప్పుడు చూపించిన ప్రేమ, అభిమానానికి రుణం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. 'భారత్‌ మాతాకీ జై' అని ప్రసంగం ముగించారు. ఇదంతా స్టేజీపై మైక్ లేకుండా సాధారణంగా మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదే వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్, పార్టీ సీనియర్ నేత అమిత్ మాలవీయ. మోదీ అంతకుముందు ఏడు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అందుకే షెడ్యూల్‌ అలస్యమై సమయం 10 దాటిందని వెల్లడించారు. 72 ఏళ్ల వయసులోనూ ఆయన నవరాత్రి ఉ‍త్సవాల సందర్భంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఇతర బీజేపీ నేతలు కూడా మోదీ నిజాయితీని కొనియాడారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు.

చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే..

మరిన్ని వార్తలు