అవినీతిపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ

3 Apr, 2024 04:21 IST|Sakshi

ఇది నా గ్యారంటీ: మోదీ 

మూడో టర్మ్‌లో కఠిన చర్యలు  

కాంగ్రెస్‌ను తుడిచిపెట్టాలి

అవినీతిపరులు జైలుకేనని వ్యాఖ్య

రుద్రపూర్‌/జైపూర్‌: అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు తనను బెదిరించేలా మాట్లాడుతున్నారని, నిస్సిగ్గుగా దూషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఉక్కుపాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందని అన్నారు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. తనను తిట్టొచ్చు, బెదిరించవచ్చు గానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు.

మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్పవంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ రాజకుటుంబ వారసుడు దేశంలో మంటలు సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడని, అలాంటివి మీరు అనుమతిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అనుచిత భాష మాట్లాడవచ్చా? వారిని మీరు శిక్షిస్తారా? లేదా? అని అడిగారు.  

బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్‌ నైజం  
‘ఎమర్జెన్సీ’ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరత, అరాచకం వైపు మళ్లించాలన్నదే కాంగ్రెస్‌ ధ్యేయమని ఆక్షేపించారు. ఆ పారీ్టకి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టాలన్న కాంగ్రెస్‌ నాయకుడిని శిక్షించాల్సింది పోయి లోక్‌సభ బరిలో దింపుతోందని ఆక్షేపించారు.

ఆ అగ్నిని పదేళ్లుగా ఆర్పేస్తున్నా...  
విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతిపై చర్యలను అడ్డుకోవడానికి అవినీతిపరులంతా చేతులు కలిపిన తొలి లోక్‌సభ ఎన్నికలివి. సొంత కుటుంబాలను కాపాడుకోవడానికి కుటుంబ పార్టీలు ర్యాలీల మీద ర్యాలీలు వరుసగా నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కూడా ఇవే’’ అన్నారు. రాజస్తాన్‌లోని కోట్‌పుత్లీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం అగి్నగుండం అవుతుందంటూ కాంగ్రెస్‌ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి అగ్నిని గత పదేళ్లుగా తాను ఆర్పేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers