తప్పుపట్టడమే కాంగ్రెస్‌ నైజం

24 Oct, 2020 04:25 IST|Sakshi
సస్రాం సభలో ప్రసంగిస్తున్న మోదీ

ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు, రామాలయ నిర్మాణం.. వీటన్నింటినీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి

బిహార్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ విమర్శ

డెహ్రీ/గయ/భగల్పూర్‌: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్‌ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్‌తస్, గయ, భగల్పూర్‌ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వేదికను పంచుకున్నారు.  దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు.

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాఖ్‌పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్‌ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్‌ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు.

గల్వాన్‌ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్‌ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు.  విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని,  రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్‌ సహచరుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌లకు నివాళులర్పిస్తూ ప్రధాని  ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో  ఆ చీకటి పాలనను బిహార్‌ ప్రజలు మర్చిపోలేరన్నారు.

సైనికులను ప్రధాని అవమానించారు
తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్‌ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు