మీ అసహనం అర్థమైంది: మోదీ

21 Mar, 2021 05:19 IST|Sakshi

సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు దాదాపుగా ఒక గంట పనిచెయ్యకపోవడాన్ని పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధితో పోలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటర్ల ఆశలకీ, నెటిజన్ల ఆందోళనలకీ ముడి పెడుతూ కామెంట్లు చేశారు. శుక్రవారం రాత్రి సోషల్‌ మీడియా 50–55 నిముషాలు ఆగిపోతేనే ప్రజలందరూ ఎంతో ఆందోళనకు లోనయ్యారని, అలాంటిది బెంగాల్‌లో అభివృద్ధి , ప్రజల కన్న కలలు 50–55 ఏళ్లు ఆగిపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బెంగాల్‌ ప్రజలు మార్పు కోసం ఎందుకంత అసహనంగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ సారి ఎన్నికలంటే ఎమ్మెల్యేలను, సీఎంను ఎన్నుకోవడం కాదు, పరివర్తన తీసుకురావడం, స్వర్ణ బెంగాల్‌ ఏర్పాటు కావడం, ఇందు కోసం  బీజేపీకి ఓటు వెయ్యాలని అభ్యర్థించారు.

అసోం టీ ఇమేజ్‌ని నాశనం చేసే వాళ్లకి మద్దతా?  
ఘుమఘుమలాడే అసోం టీ గుర్తింపుని నాశనం చేయాలనుకునే శక్తులకి కాంగ్రెస్‌ పార్టీ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఎగువ అసోంలోని చాబువాలో తేయాకు తోటల్లో పని చేసే కార్మికులతో సంభాషించిన మరుసటి రోజే అదే ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అత్యంత పురాతన టీ పరిశ్రమకున్న గౌరవం, గుర్తింపుతో కాంగ్రెస్‌ పార్టీ ఆడుకుంటోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో టూల్‌కిట్‌ సాయంతో అసోం టీ, భారతీయ యోగాని దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి టూల్‌కిట్‌లు తయారు చేస్తున్న వారికి కాంగ్రెస్‌ మద్దతునిస్తోందని విమర్శించారు. తేయాకు తోటల్లో పని చేసే వారి కష్టాలు చాయ్‌ వాలా తప్ప మరెవరు అర్థం చేసుకుంటారని ప్రధాని అన్నారు.

>
మరిన్ని వార్తలు